హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు సోమవారం రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల జిల్లాలోకి ప్రవేశించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రమంతటా విస్త్తరిస్తాయని తెలిపింది. దీంతో తెలంగాణ తూర్పు, దక్షిణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.
కాగా.. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉన్నదని, దీనివల్ల ఈ ఏడాది దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నదని వివరించింది. ఇదిలా ఉండగా, గడిచిన 24 గంటల్లో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కరువుగా, అత్యధికంగా సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో 11.02 సెం.మీ వర్షపాతం నమోదైందని పేర్కొన్నది.
రంగారెడ్డి జిల్లా కొండాపూర్, రాజేంద్రనగర్లో 8.78 సెం.మీ, నల్లగొండ జిల్లా దామరచర్లలో 7.35 సెం.మీ, ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో 5.70 సెం.మీ, నాగర్కర్నూల్ జిల్లా తెల్కపల్లిలో 4.18 సెం.మీ, ములుగు జిల్లా మల్లపల్లిలో 3.88 సెం.మీ, నిజామాబాద్ జిల్లా సిరికొండలో 3.80 సెం.మీ, సిద్దిపేట జిల్లా గజ్వేల్లో 3.25 సెం.మీ, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 3.20 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.