Markfed | హైదరాబాద్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ): మార్క్‌ఫెడ్‌లో ఎరువుల విక్రయం గాడి తప్పింది. హెడ్ ఆఫీస్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరా చేసుకొని కిందిస్థాయి సిబ్బంది అందినకాడికి దోచుకుంటున్నట్టు వరుసగా జరుగుతున్న ఘటనలు వెల్లడిస్తున్నాయి. ఎరువుల విక్రయంలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని తెలిసినప్పటికీ మార్క్‌ఫెడ్ అధికారులు మొద్దునిద్రపోతుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గత అనుభవాలు కండ్ల ముందు ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోకపోవడం వెనుక మతలబు ఏమిటనే సందేహాలు వినిపిస్తున్నాయి. దీని వెనుక అధికారుల హస్తం కూడా ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ హెడ్ ఆఫీసులోని అధికారులు డీసీఎంఎస్‌లకు ఎరువులను సరఫరా చేసి తమ పని అయిపోయినట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
జిల్లా స్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అవకతవకలు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్‌లో రూ. లక్షల్లో అవకతవకలు బయటపడగా తాజాగా కరీంనగర్ జిల్లాలోనూ అవినీతి బయటపడింది. ఎరువులు విక్రయించగా వచ్చిన సొమ్ము మార్క్‌ఫెడ్‌కు జమ చేయకుండా కింది స్థాయి ఉద్యోగులు కాజేసినట్టు తేలింది.
కరీంనగర్ జిల్లాలో జరిగిన ఘటనపై ఓ అధికారి దర్యాప్తు జరిపి అంతా సవ్యంగానే ఉందని రిపోర్టు ఇవ్వగా 10 నెలల తరువాత విచారణ జరిపిన మరో ఉన్నతాధికారి రూ.76 లక్షలకుపైగా దారి తప్పినట్టు నివేదికనిచ్చారు. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత సెప్టెంబర్‌లో హెడ్ ఆఫీస్ నుంచి ఓ అధికారి నేతృత్వంలోని బృందం కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో పర్యటించి ఎరువుల విక్రయంలో లెడ్జర్లను, ఖాతాలోని సొమ్మును పరిశీలించింది. విచారణలో ఎరువులు విక్రయించిన సొమ్ముకు, బ్యాంకుల్లో ఉన్న సొమ్ము సరిపోయిందని అదే నెలలో రిపోర్ట్ ఇచ్చింది.
ఈ బృందం సిద్దిపేట, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట్ జిల్లాల్లోనూ విచారణ చేసింది. గత నెల మొదటివారంలో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో ఎరువుల సొమ్ము కాజేశారనే ఫిర్యాదు వచ్చింది. దీనిపై ఉన్నతాధికారులు మరో అధికారి నేతృత్వంలో విచారణ కమిటీ వేశారు. ఈ విచారణలో రూ.76.77 లక్షల సొమ్ము పక్కదారిపట్టినట్టు బట్టబయలైంది. దీనికి బాధ్యులైన అధికారిని వెంటనే సస్పెండ్ చేశారు. గత సెప్టెంబర్ నివేదికలో సొమ్ము సవ్యంగా ఉందని, తాజా విచారణలో అక్రమాలు జరిగాయని నివేదిక రావడంపై మార్క్‌ఫెడ్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
ఎరువుల విక్రయంలో సొమ్ము పక్కదారిపట్టడం ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఖమ్మంలో రూ. 40 లక్షలు, నల్లగొండలో రూ. 60 లక్షలు, ఆదిలాబాద్‌లో రూ.50 లక్షలు పక్కదారి పట్టాయి. హెడ్ ఆఫీసు నుంచి డీసీఎంఎస్‌లకు ఎంత మొత్తం ఎరువులు ఇచ్చాం, అందుకు ఎంత డబ్బు రావాలనే లెక్క ఉంటుంది. అమౌంట్ తక్కువగా వస్తే అధికారులను ఎందుకు ప్రశ్నించడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో రైతులకు 60 శాతం ఎరువులను మార్క్‌ఫెడ్ సరఫరా చేస్తుంది. డీసీఎంఎస్‌ల నుంచి ప్యాక్స్‌కు, ఇతర ఔట్‌లెట్స్‌కు అందించి అక్కడి నుంచి రైతులకు అందజేస్తుంది. మార్క్‌ఫెడ్ ప్రతియేటా రూ.600 కోట్లకు పైగా లావాదేవీలు జరుపుతుంది. భారీ మొత్తంలో వ్యాపారం చేస్తున్నప్పటికీ ఎరువుల సరఫరా, విక్రయానికి సంబంధించి ఆడిట్ జరగడం లేదని తెలిసింది. రెండేండ్లుగా ఆడిట్ లేకపోవడంతో అధికారులు ఆర్థిక అరాచకాలకు తెరతీసారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో అవకతవకలు జరిగినట్టు నిరుడు ఇచ్చిన నివేదికలో వెల్లడికాలేదు. ఈ ఏడాది జూలై 5న దృష్టికి రాగానే విచారణ జరిపాం. ఇందులో అవకతవకలు జరిగినట్టు గుర్తించి సంబంధిత అధికారిని సస్పెండ్ చేశాం.
-విష్ణువర్ధన్‌రావు, మార్క్‌ఫెడ్ జీఎం