గ్రేటర్లో రాజకీయం వేడెక్కింది. పోరు బరిలో నిలిచే అభ్యర్థులెవరో తేలిపోవడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతిపక్షాలు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలతో బహిరంగ సభలు, రోడ్ షోలు, అంతర్గత సమావేశాలతో పాటు స్టార్ క్యాంపెయిన్లను ప్రచార పర్వంలోకి దించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుండగా, రెండున్నర నెలలుగా గులాబీ పార్టీ అభ్యర్థులు ప్రజాక్ష్రేత్రంలోనే ఉంటూ అన్ని వర్గాల ప్రజల మద్దతును కూడగట్టి తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దారు. మొత్తంగా ప్రచార పర్వంలో గులాబీపార్టీదే జోరు కనిపిస్తున్నది.
– సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ)
అంబర్పేట/కాచిగూడ, నవంబర్ 4: అంబర్పేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ గోల్నాక డివిజన్ సుందర్నగర్కు చెందిన గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు(మైనార్టీ నాయకుడు) మహ్మద్ బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం మహ్మద్ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి బీఆర్ఎస్లో చేరానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ మహ్మద్ కబీర్, సయ్యద్, సయ్యద్ సలీం తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నియోజకవర్గంలోని మల్లికార్జున నగర్, గోల్నాక లాల్బాగ్, వీరన్నగుట్ట తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, వారి సహకారంతో అంబర్పేటలో తాను చేసిన అభివృద్ధి పనులను వారికి వివరించారు.