హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ) : ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీని అవినీతి కేసు నుంచి కాపాడడం కోసమే ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలో పర్యటించారని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఆరోపించారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వ్యాపారవేత్త ఎలాన్‌మస్క్‌తో మోదీ భేటీ అయింది కూడా అందుకేనని విమర్శించారు. విద్యుత్ ఒప్పందాల వ్యవహారంలో లంచాల ఆరోపణలతో న్యూయార్క్ కోర్టులో అదానీపై కేసు నడుస్తున్నదని చెప్పారు. అమెరికా పార్లమెంట్ ముందు నుంచి నారాయణ సోమవారం సోషల్‌మీడియాలో వీడియో విడుదల చేశారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందం వ్యవహారంలో అక్రమాలు బయటపడ్డాయని తెలిపారు. ఈ కేసు ను నిర్వీర్యం చేయడానికి మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ట్రంప్‌ను మోదీ భారత్‌కు ఆహ్వానించడం సరికాదని, ట్రంప్ వస్తే భారత్ అంతర్జాతీయ కుంభకోణాల్లో కూరుకుపోతుందని హెచ్చరించారు.