హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కోరారు. రెండు తెలుగు రాష్ర్టాల రాజధానులను కలిపే 65వ నంబరు జాతీయ రహదారిని ఆరు లేన్లకు విస్తరించాలని విజ్ఞప్తిచేశారు. సోమవారం ఢిల్లీలో గడ్కరీతో భేటీ అయిన కేసీఆర్.. రాష్ట్రంలో రహదారులకు సంబంధించి 5 లేఖలు అందజేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత 2,168 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మొత్తం 3,306 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా గుర్తిస్తామని అంగీకరించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. మిగిలిన 1,139 కిలోమీటర్ల రహదారుల గుర్తింపును కూడా పూర్తిచేయాలని కోరారు. వీటిలో 442 కిలోమీటర్ల నాలుగు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అత్యంత ప్రాముఖ్యం ఇచ్చి అభివృద్ధిచేయాలని విజ్ఞప్తిచేశారు. దక్షిణ ఆర్ఆర్ఆర్లో భాగంగా చౌటుప్పల్-ఆమనగల్-షాద్‌నగర్ (182 కి.మీ), కరీంనగర్-సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం (165 కి.మీ.), కొత్తకోట, గూడూరు నుంచి మంత్రాలయం దాకా 70 కిలోమీటర్లు, జహీరాబాద్-బీదర్-దెగ్లూర్ మధ్య 25 కిలోమీటర్ల మేర నేషనల్ హైవేలుగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపించినట్టు చెప్పారు. దీనివల్ల పర్యాటకంతోపాటు.. ఇతర రాష్ర్టాలతో కనెక్టివిటీ పెరుగుతుందని తెలిపారు.
6 లేన్లకు విజయవాడ-హైదరాబాద్ హైవే
రెండు రాష్ర్టాల రాజధానులను అనుసంధానించే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని 2024 నాటికి ఆరు లేన్లకు విస్తరించాలనే ఒప్పందం ఉన్నదని గడ్కరీకి సీఎం కేసీఆర్ వివరించారు. ఇందుకు సంబంధించి ఎన్‌హెచ్ 65ని 2012లో బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (బీవోటీ) ఒప్పందం కింద జీఎంఆర్ ఎక్స్‌ప్రెస్ వే సంస్థ నాలుగు లేన్ల హైవేను నిర్మించి నిర్వహిస్తున్నదని, నాటి ఒప్పందం మేరకు 2024 ఏప్రిల్ నాటికి ఆరు లేన్లకు విస్తరించాల్సి ఉన్నదని గుర్తుచేశారు. కానీ.. ఇందుకోసం ఏవో అటంకాలున్నాయంటూ సాకులు చెప్తున్నారని గడ్కరీకి వివరించారు. ఈ విషయంలో ఎలాంటి వివాదాలు కానీ, అభ్యంతరాలు కానీ లేవని తెలిపారు. ఈ రహదారిలో ప్రతిరోజూ సగటున 40 వేల వ్యక్తిగత వాహనాలు తిరుగుతున్నాయని టోల్ రికార్డులు చెప్తున్నాయని, ఈ ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ కోరారు.
సీఆర్ఐఎఫ్ నిధులు ఇవ్వండి
రాష్ట్ర రహదారుల అభివృద్ధికోసం సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్) నుంచి రూ.744 కోట్ల నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రి గడ్కరీని సీఎం కేసీఆర్ కోరారు. తమ పార్లమెంట్ సభ్యులు వారివారి నియోజకవర్గాల్లోని రోడ్ల అభివృద్ధి కోసం సవివరంగా ప్రతిపాదనలు చేశారని గుర్తుచేశారు. కానీ, కేంద్ర ఉపరితల రవాణాశాఖ రూ.250 కోట్లు మాత్రమే ఇస్తామని చెప్పిందని.. పెండింగ్‌లో ఉన్న తమ ప్రతిపాదనలను అంగీకరించి, 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు పూర్తిగా నిధులు విడుదలచేయాలని కోరారు.
సోమశిల వద్ద బ్రిడ్జి నిర్మించండి
కల్వకుర్తి నుంచి ఏపీలోని నంద్యాల దాకా (167 కి.మీ.).. కొల్హాపూర్, సోమశిల, కరివెన మీదుగా జాతీయ రహదారిని నోటిపై చేసినందుకు గడ్కరీకి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపాశారు. ఈ హైవే వల్ల తెలంగాణలో వెనుకబడిన నాగర్‌కర్నూల్, ఏపీలో ఆత్మకూరు ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందన్నారు. కృష్ణానదిపై సోమశిల వద్ద కొత్త వంతెన నిర్మిస్తే హైదరాబాద్-తిరుపతి-చెన్నైల మధ్య దాదాపు 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని.. కాబట్టి ఈ వంతెన నిర్మాణం చేపట్టాలని తెలిపారు. కొత్తగా ప్రకటించిన 167 జాతీయ రహదారి కల్వకుర్తి వద్ద ప్రారంభం అవుతుందని, దీనికి అనుబంధంగా ఉన్న జాతీయ రహదారి 765 హైదరాబాద్‌ను ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం వద్ద ఉన్న జ్యోతిర్లింగాన్ని కలుపుతుందని తెలిపారు. ప్రస్తుతం టోల్రికార్డుల ప్రకారం రోజుకు 14 వేల వ్యక్తిగత వాహనాలు కల్వకుర్తి వరకు తిరుగుతున్నాయని తెలిపారు. కల్వకుర్తి- కరివెన రహదారి అభివృద్ధి కాగానే ట్రాఫిక్ ఇంకా పెరుగుతుందని, దీనిని గుర్తించి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌నుంచి కల్వకుర్తి వరకు నాలుగులేన్ల రహదారిని నిర్మించాలని సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రిని కోరారు. సీఎంతోపాటు కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీని కలిసిన వారిలో రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఖమ్మం మాజీ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు. అనంతరం కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సీఎం కేసీఆర్ జరిపిన భేటీలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
దక్షిణ ఆర్ఆర్ఆర్ను మంజూరు చేయండి
హైదరాబాద్ నగరానికి దక్షిణ భాగంలో 182 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు మంజూరుచేయాలని గడ్కరీని సీఎం కేసీఆర్ కోరారు. 2018 ఆగస్టు 27న న్యూఢిల్లీలో కలిసి హైదరాబాద్ చుట్టూ 340 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ను పూర్తి ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించాలని చర్చించి, నివేదించామని గుర్తుచేశారు. ఉత్తర విభాగంలో సంగారెడ్డి- గజ్వేల్- చౌటుప్పల్ వరకు 158 కిలోమీటర్ల రీజనల్ రింగ్‌రోడ్డును మంజూరు చేశారని పేర్కొన్నారు. 2018లో ఈ రోడ్డుకు అలైన్మెంట్ ప్రతిపాదనలు రూపొందించామని, ఆ తర్వాత ఈ ప్రాంతంలో గజ్వేల్ రింగ్‌రోడ్డు, బస్వాపూర్ రిజర్వాయర్లు వచ్చాయని వివరించారు. వీటి కారణంగా గజ్వేల్ నుంచి యాదాద్రి వరకు కొన్నిమార్పులు చేశామని, వీటికి అంగీకారం తెలిపారని వెల్లడించారు. దక్షిణభాగం రీజినల్ రింగ్‌రోడ్డుకు రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వశాఖ అడిగిన ప్రతిపాదనలు, వివరణలు ఇచ్చామని పేర్కొన్నారు. దక్షిణభాగం రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే తెలంగాణ సహా మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీకి ప్రయోజనం కలుగుతుందన్నారు. వీలైనంత త్వరగా దక్షిణ ఆర్ఆర్ఆర్ను మంజూరుచేయాలని కోరారు.