హైదరాబాద్, మే 12(నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి నరేంద్రమోదీ దగ్గర తెలంగాణ బీజేపీ నేతల పరపతి ఏమిటో తేలిపోయింది. రెండేండ్ల తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన మోదీ మన రాష్ట్ర బీజేపీ నేతలను పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో తెలంగాణ గడ్డ మీద ఏపీ నేతలకు ఇచ్చిన విలువ కూడా తమకు ఇవ్వకపోవ టంతో బీజేపీ నేతలు కంగుతిన్నారు. జరిగిన ఘోర అవమానం భరించలేక ముఖం చాటేస్తున్నారు. మోదీ పర్యటనలోని ప్రతి అడుగు చంద్రబాబు దిశానిర్దేశంలోనే జరిగిందనే వాదనలు బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
మాట్లాడుతానని చెప్పి.. మాట మార్చి
మోదీ చివరగా 2024 మే నెలలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు వచ్చారు. అంటే సరిగ్గా రెండేండ్ల తర్వాత మళ్లీ అడుగుపెట్టారు. మూడోసారి ప్రధాని అయ్యాక రాష్ర్టానికి రావడం ఇదే తొలిసారి. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనాపరంగా ఘోర వైఫల్యం చెందడం, ఇటీవలి ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో ఎన్డీయేకు అనుకూల ఫలితాలు రావడంతో మోదీ పర్యటన మీద రాష్ట్ర బీజేపీ నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. ఆయనతో నేరుగా మాట్లాడినప్పుడే ఏయే అంశాలు వివరించాలో సిద్ధమయ్యారు. మోదీ సైతం తెలంగాణ నేతలతో భేటీ కోసం గంట సమయం కేటాయించినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. హైటెక్స్‌లో జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం తర్వాత భేటీ ఉంటుందని చెప్పారు. అయితే ఈ భేటీని ప్రధాని చివరి నిమిషంలో రద్దు చేసుకొని, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఇంటికి వెళ్లడంతో రాష్ట్ర బీజేపీ నేతలు నోరెళ్లబెట్టారు. తమకు ఇచ్చిన గంట సమయాన్ని చంద్రబాబు తన్నుకుపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. నవ్వినోని ముందే బోర్లా పడ్డట్టు అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా మీద పుండు మీద కారం చల్లినట్టు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ నివాసాలకు వెళ్లిన ఫొటోలను మోదీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
సభ పేరు మారింది.. మోదీ మాటా మారింది
బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణే అని, ఇందుకోసం మోదీ పర్యటనలో రోడ్‌మ్యాప్ పడుతుందని, ఆయన తమ అభిప్రాయాలను తీసుకొని రాజకీయ వ్యూహరచన చేస్తారని రాష్ట్ర బీజేపీ నేతలు ఊదరగొట్టారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, దీనిని మోదీ అందిపుచ్చుకొంటారని, తన పదునైన విమర్శలతో కాంగ్రెస్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తారని రాష్ట్ర నాయకత్వం భావించింది. ఆ ఊపుతో తాము తెలంగాణలో రెచ్చిపోవాలని అనుకున్నది. కానీ పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో సీన్ మొత్తం మారిపోయింది. వాస్తవానికి ఈ సభకు ‘జన ఆగ్రహ సభ’ అని పేరు పెట్టగా, ఆ పేరు తీసేయాలని, దాని స్థానంలో ‘బీజేపీ సభ’గా నామకరణం చేయాలని బీజేపీ పెద్దలు ఆదేశించారట. దీంతో రాష్ట్ర నేతలు దిగ్భ్రాంతి చెందారని సమాచారం. అంతేకాదు.. సభలో కాంగ్రెస్ వైఫల్యాలను మోదీ ఎండగడుతారని అనుకుంటే, ఆయన స్వరం మారిందని, పైగా ‘మాతో కలిసి పనిచేయండి’ అని బహిరంగంగా రేవంత్‌రెడ్డిని కోరడంతో బీజేపీ నేతలు ఆశ్చర్యపోయారు. చంద్రబాబు సూచన మేరకే ఆయన శిష్యుడైన రేవంత్‌రెడ్డి పట్ల మోదీ సానుకూల వైఖరి చూపించారని చెప్పుకొంటున్నారు. ఈ పరిణామాలన్నీ గమనించిన బీజేపీ శ్రేణులు ‘ఇద్దరు కేంద్ర మంత్రులు సహా 8మంది ఎంపీలు, 8మంది ఎమ్మెల్యేలు ఉన్నా, మోదీ దగ్గర మనోళ్ల పరపతి ఇంతేనా?’ అని చర్చించుకొంటున్నారు.