హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఈ నెల 30న జరుగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిక్స్ కొట్టి రాష్ట్రంలో హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఓడించి ‘ఎలక్షన్ వరల్డ్ కప్’ గెలుస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే నిర్వహించిన ‘తెలంగాణ రౌండ్‌టేబుల్’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల మాదిరిగానే తాము ఎన్నికల పరీక్షలు రాస్తున్నామని, ఎంత మెజార్టీ వస్తుందనే ఆసక్తితో ఎదురు చూస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ బీఆర్ఎస్ వైపే ఉన్నారని, సీఎం కేసీఆర్‌నే గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కొంతమంది చేరికలతో కాంగ్రెస్‌కు కొంత ఊపు వచ్చినట్టు కనిపిస్తున్నదని, కానీ క్షేత్రస్థాయిలో ఆ పార్టీ పుంజుకోలేదని అన్నారు. గత ఆరు నెలల్లోనే బీజేపీ పని అయిపోయిందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీలు కాబట్టి డబ్బులు, వనరులు ఎక్కువగా ఉంటాయని, అందుకే హడావుడి చేస్తున్నాయని, మైండ్ గేమ్ ఆడుతున్నాయని అభిప్రాయపడ్డారు. వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయని విమర్శించారు. బండి సంజయ్‌పై కాంగ్రెస్ ఒక అనామకుడిని పోటీలో ఉంచిందని, ధర్మపురి అర్వింద్పైనా డిపాజిట్ కూడా వచ్చే అవకాశం లేని వ్యక్తిని పోటీకి దింపిందని ఆరోపించారు.
మోదీకి రాహుల్‌గాంధీ పెద్ద ఆస్తి అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాహుల్ ఉన్నంత కాలం కాంగ్రెస్‌కు బీజేపీని ఆపే శక్తి రాదని స్పష్టంచేశారు. ఆ శక్తే ఉంటే గుజరాత్లో, యూపీలో ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. మొదటి నుంచీ బీజేపీని ప్రాంతీయ పార్టీలే నిలువరించాయని, మోదీని కేసీఆర్, మమతాబెనర్జీ, స్టాలిన్, కేజ్రీవాల్ వంటి ప్రాంతీయ పార్టీల నేతలే ప్రశ్నించారని చెప్పారు. పొరుగున ఉన్న కర్ణాటకలో 2013 నుంచి 2018 వరకు కాంగ్రెస్, 2018 నుంచి 23 వరకు బీజేపీ అధికారంలో ఉన్నాయని గుర్తు చేశారు. రెండు జాతీయ పార్టీలు పాలించిన కర్ణాటకతో, బీఆర్ఎస్ పాలనలో ఉన్న తెలంగాణను పోల్చి చూడాలని కోరారు. తలసరి ఆదాయం మొదలు ఏ రంగంలో చూసినా తెలంగాణదే పైచేయి అని చెప్పారు. ఐటీ ఉద్యోగాల కల్పనలో తెలంగాణ వరుసగా రెండో ఏడాది కర్ణాటకను అధిగమించిందని చెప్పారు. గతేడాది దేశంలో సృష్టించిన ఐటీ ఉద్యోగాల్లో 33 శాతం తెలంగాణలోనే రాగా, ఈ ఏడాది 44 శాతానికి పెరిగిందని తెలిపారు.
ఒకేసారి దేశవ్యాప్తంగా పోటీ చేయాలనే ఆశ తమకు లేదని, క్రమంగా విస్తరిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇటీవలే మహారాష్ట్రలో బీఆర్ఎస్ 50కి పైగా సర్పంచ్ స్థానాలు గెలిచిందని గుర్తు చేశారు. తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టిన తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్తామని చెప్పారు. అక్కడ 48 ఎంపీ సీట్లలో కనీసం 15 నుంచి 20 స్థానాలు గెలుస్తామన్నారు. మధ్యప్రదేశ్, కర్ణాటక, ఏపీ.. ఇలా సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కనీసం 30కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. కేంద్రంలో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తామన్నారు. కేసీఆర్ జాతీయ సంపద అని, తెలంగాణ మాదిరిగా దేశాన్ని కూడా అభివృద్ది చేస్తారని చెప్పారు.
డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో ప్రముఖ నటి రష్మిక మందన్న అశ్లీల వీడియోను సృష్టించి, వైరల్ చేసిన ఘటనను మంత్రి కేటీఆర్ ఖండించారు. ఒక మహిళను, సెలబ్రిటీని ఈ విధంగా అవమానించడం దారుణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కచ్చితంగా ఆలోచిస్తామని చెప్పారు. అవసరమైతే చట్టం కూడా చేస్తామన్నారు. కేంద్రం కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వరల్డ్ కప్ నేపథ్యంలో పలు అంశాలపై మంత్రి కేటీఆర్ క్రికెట్ పరిభాషలో సమాధానం ఇచ్చారు. ‘మా కెప్టెన్ సీఎం కేసీఆర్ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆయనకు సబ్‌స్టిట్యూట్ అవసరం లేదు’ అని పేర్కొన్నారు. తాను క్రికెట్ చూస్తానని, అయితే తెలంగాణలో ఎన్నికల వరల్డ్ కప్ నడుస్తున్నందున వరల్డ్ కప్ చూడటం లేదని చెప్పారు. ‘నవంబర్ 30న సిక్స్ కొట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. 2024లో మోదీని ఓడించి ప్రపంచ కప్ గెలుస్తాం’ అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ భారత జట్టు మాదిరిగా బలంగా ఉన్నదని అన్నారు. కాంగ్రెస్‌ను స్థిరత్వం, ఐకమత్యం లేని పాకిస్థాన్ జట్టుతో పోల్చారు. బీజేపీ పేరుగొప్ప, ఊరు దిబ్బ మాదిరిగా ఆడుతున్న ఇంగ్లండ్ జట్టుతో పోల్చారు.
దేశంలో మూడో వ్యక్తి ఎదగడం ప్రధాని మోదీకి, రాహుల్ గాంధీకి ఇష్టం ఉండదని కేటీఆర్ విమర్శించారు. జాతీయ స్థాయిలో అధికారం, రాజకీయం వాళ్లిద్దరి మధ్యే ఉండేలా చూసుకుంటారని చెప్పారు. అందుకే ప్రజాదరణ పెరుగుతున్న పార్టీని ‘బీ-టీం’ అని ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తుంటారని మండిపడ్డారు. రాహుల్‌గాంధీ కోల్‌కతాకు వెళ్తే మమతాబెనర్జీని, ఢిల్లీకి వెళ్లి కేజ్రీవాల్‌ను, కర్ణాటక వెళ్లి కుమారస్వామిని బీజేపీకి బీ-టీం అంటారని, మోదీ కూడా ఇదే తరహాలో విమర్శలు చేస్తారని వివరించారు. సీఎం కేసీఆర్ మూడోసారి గెలిస్తే జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపిస్తారని రెండు పార్టీలూ భయపడుతున్నాయని చెప్పారు. అందుకే కేసీఆర్‌ను తెలంగాణకే పరిమితం చేసేందుకు ‘బీ-టీం’ అంటూ దుష్ప్రచారానికి దిగుతున్నాయని మండిపడ్డారు. 2001 నుంచి ఇప్పటివరకు బీఆర్ఎస్ చరిత్రలో ఒక్కసారి కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోలేదని తెలిపారు. ఎంఐఎం గతంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిందని, అప్పుడు బీ టీమ్ అని కాంగ్రెస్ చెప్పుకోలేదని, ఇప్పుడు బీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతు ఇస్తుంటే మాత్రం బీ టీమ్ అంటున్నారని మండిపడ్డారు.