హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): దేశ ఆర్థిక భవిష్యత్తును మోదీ సర్వనాశనం చేస్తున్నారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ప్రగతిభవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘రాష్ట్రాల ప్రగతిని దెబ్బతియడానికే ప్రభుత్వం పనిచేస్తున్నది. తెలంగాణలో పైసలు రాకుండ చేసినం.. ఆర్బీఐ ఇయ్యదు అని ఢిల్లీ నుంచి సమాచారం పంపిస్తరు. ‘రైతుబంధు ఇయ్యరట, పైసలు లేవట, ఉద్యోగులకు జీతాలు లేవట’ అని కొన్ని పేపర్లు రాస్తయి. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చే రైతుబంధు బంద్ చేయడానికా భారతదేశ ప్రభుత్వం ఉన్నది? మీ చిల్లర రాజకీయం కోసం, రైతుల నోట్ల మట్టి కొడుతరా? రాష్ట్రాల ప్రగతిని దెబ్బతిస్తరా? దేశం గొంతు పిస్కుతరా? సమాధానం చెప్పండి మోదీ.
సైన్యాన్ని కూడా వదులతలేరు
బీజేపీ, నరేంద్రమోదీ ప్రభుత్వం చివరికి సైన్యాన్ని కూడా వదిలిపెడుతలేదు. ‘సేనా మే జోష్ చాహియే, యంగ్ బ్లడ్ చాహియే’ అని వాడెవడో మాట్లాడుతడు. సేనా మే చాహియే.. కేంద్ర సర్కార్ మే నహీ చాహియే? హటా దో నరేంద్రమోదీకో.. బుడ్డా హోగయే నరేంద్రమోదీ.. యహా బీ జోష్ చాహియే. అగ్నిపథ్ తరువాత నేను చాలా బాధపడి అనేకమంది పెద్దపెద్ద మేజర్లుగా, కెప్టెన్లుగా, లెఫ్ట్నెంట్లుగా పనిచేసిన వారితో మాట్లాడిన. దేశం మీద కనీసం ప్రేమ ఉన్న ప్రధాని అయితే ఇంత దుర్మార్గమైన పని చెయ్యరు. ఒక డెడికేటెడ్ సోల్జర్ తయారు కావాలంటే ఆరున్నర.. ఏడు సంవత్సరాలు పడతది. అగ్నిపథ్ కింద చెప్తున్న నాలుగేండ్లలో శిక్షణలో మూడేండ్ల పావు అయిపోయింది.. ఎనిమిది నెలలు అయితే నేను వెళ్లిపోతా.. నేను ఎందుకు కొట్లాడుతా అనుకుంటరు. ఇంత పెద్ద పాలసీ మ్యాటర్లో ఇంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తరా? ఎవరన్న మాట్లాడితే దేశ ద్రోహి అంటరు. సైన్యంలో జోష్ రావాలి అంటరు.. మరి కేంద్రంలో వద్దా? కేంద్రంలో 60 శాతం ముసలోల్లే. యంగ్ ప్రధాని ఉంటే ఇంకా బాగా జరగదా? మనకు అసలు ప్రమాదం చైనా. భారత్-చైనా సరిహద్దు ప్రయోగశాల కాదు. సువిశాలమైన దేశం.. మా ఇష్టమున్నట్టు చేస్తం అంటరా?
హిందూత్వ అంటే ఇదికాదు
వీళ్లు చెప్పే హిందూత్వ కరెక్ట్ కాదని, బనారస్‌లో కర్పాత్ర మహరాజ్ తులసీఘాట్లో 60 ఏండ్ల కింద బుక్ రాసిండు. కాశీ అంటే మనమందరం పవిత్రంగా భావించే అతిపెద్ద పుణ్యక్షేత్రం. చాలామంది చివరి దశలో కాశీలో చనిపోవాలని అక్కడ చిన్న రూం కొనుక్కొని అక్కడే ఉండి చనిపోతరు. అక్కడ మోదీ ఎంత దుర్మార్గం చేశాడంటే.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలవాలని.. దాని కోసం కాశీ కడుతున్నామని నట్లు, బోల్టులు పెట్టి కట్టిండు ఈ దరిద్రుడు. నాలుగు రోజుల కింద ఇయన కట్టిన మెయిన్ పిల్లర్ పడిపోయింది. ప్రధాన గోపురం పడిపోయింది. కశ్మీర్ ఫైల్స్ సినిమా తీసి లోకాన్ని గందరగోళం చేద్దామనుకున్నరు. ఇప్పుడు కశ్మీర్ పండితులు రోడ్ల మీద కూర్చొని రెండునెలలు అయింది. రోజూ సమ్మె చేస్తున్నరు. ‘మీరు దద్దమ్మలు, ఇక్కడ టెర్రరిజం బంద్ కాలేదు. మీకు దండం పెడుతాం మమ్ముల్ని ఇక్కడి నుంచి తీసుకపోవాలి’ అని కోరుతున్నరు.