హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తీరును తప్పుపడుతూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు నిరంకుశ ధోరణికి తార్కాణమని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తున్నానని చెప్తూనే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు రూపాయి కూడా కేటాయించకుండా మోదీ తన సంకుచిత మనస్తత్వాన్ని బయట పెట్టుకొన్నారని శుక్రవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటు అప్రజాస్వామిక పద్ధతిలో జరిగిందని మోదీ పేర్కొనడం ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ అవమానించారని, సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచారని నిప్పులు చెరిగారు. తెలంగాణపై విద్వేషాన్ని వెళ్లగక్కిన మోదీతోపాటు బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరమున్నదని దామోదర్ పేర్కొన్నారు.