CM Revanth Reddy | హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో కుట్రతో శివసేనను, ఎన్సీపీని చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశామని మోదీ భావించారని కానీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల తిరస్కారానికి గురై మొహం చూపించలేని పరిస్థితి తెచ్చుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో మాదిరిగా తెలంగాణలోనూ ప్రయోగం చేస్తారేమో చూడాలని వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఉగాది పచ్చడి మాదిరిగా కొంత తియ్యగా, కొంత పుల్లగా, కొంత చేదుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఫలితాలు అనుకూలంగా వచ్చినా, తాము ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదని చెప్పారు. మల్కాజిగిరి సిట్టింగ్ ఎంపీ స్థానం ఓడిపోయినా, అదే పరిధిలోని కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం గెలిచామని చెప్పారు.
మహబూబ్‌నగర్‌లో ఓటమిపై స్పందిస్తూ.. తాను రాష్ర్టానికి ముఖ్యమంత్రినని, పీసీసీ అధ్యక్షుడినని, కాబట్టి రాష్ట్రంలో ఏ సీటు గెలిచినా, ఓడినా పూర్తి బాధ్యత తనదేనని స్పష్టంచేశారు. వంద రోజుల్లో ఐదు గ్యారెంటీలను అమలు చేశామని, పార్లమెంట్ ఎన్నికలను వంద రోజుల పాలనకు రెఫరెండంగా భావిస్తామని చెప్పామని గుర్తుచేశారు. 2019లో కాంగ్రెస్ మూడు స్థానాల్లో గెలువగా ఈసారి ఎనిమిది సీట్లు గెలిచామని, కంటోన్మెంట్ ఉప ఎన్నిక ద్వారా అదనంగా మరో ఎమ్మెల్యే సీటు వచ్చిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 39.5% ఓట్లు రాగా.. లోక్‌సభ ఎన్నికల్లో 41% వచ్చాయని వివరించారు. సీట్లు, ఓట్ల శాతం పెరగడం ద్వారా కాంగ్రెస్ పాలనను ప్రజలు ఆశీర్వదించారని పేర్కొన్నారు. ఏపీలో ఏర్పడే నూతన ప్రభుత్వంతో స్నేహపూర్వక వాతావరణంలో సమస్యలను పరిషరించుకుంటామని స్పష్టంచేశారు. చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారానికి పిలిస్తే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. చంద్రబాబు ఇండియా కూటమి వైపు మొగ్గుచూపేలా తాను చొరవ తీసుకోవడంపై రాష్ట్ర పార్టీలో చర్చిస్తామని, ఒప్పుకుంటే రాహుల్‌గాంధీ ముందు ప్రతిపాదన పెడతామని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీపై కాంగ్రెస్ కట్టుబడి ఉన్నదని పేర్కొన్నారు.
2014లో బీజేపీ మ్యానిఫెస్టోలో 10 మంది ఫొటోలు, 2019లో నలుగురైదుగురి ఫొటోలు, ఇప్పుడు ఒకే వ్యక్తి ఫొటో పెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఈ దఫా బీజేపీ బలం 303 సీట్ల నుంచి 240కి పడిపోయిందని వివరించారు. మోదీ గ్యారెంటీకి వారెంటీ చెల్లిపోయిందని, దేశ ప్రజలు మోదీని తిరసరించారని పేర్కొన్నారు. మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని, ప్రజల తిరసరణకు గురైనందున మళ్లీ ప్రధాని పదవి చేపట్టకూడదని డిమాండ్ చేశారు. ఒకవేళ మోదీ ప్రధాని పదవి చేపడితే విలువలతో కూడిన రాజకీయాలకు తిలోదకాలు ఇచ్చినట్టేనని స్పష్టంచేశారు. యూపీలోని అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్ స్థానంలో బీజేపీ ఓడిపోయిందని, రాముడి పేరు మీద ఓట్లు అడగడాన్ని రాముడు కూడా క్షమించలేదని, బీజేపీ నాయకులకు దేవుడు గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయని, బీజేపీ గెలిచిన 7 సీట్లలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇకపై తమ ఆత్మప్రభోదానుసారం వ్యవహరించాలని కోరారు.