మరోసారి కేంద్ర ప్రభుత్వం కొర్రీ
ధాన్యం కొనుగోళ్లపై రాష్ర్టాలతో ఎఫ్‌సీఐ సమీక్ష
రా రైస్ మాత్రమే తీసుకుంటామని మొండివైఖరి
యాసంగిలో బాయిల్డ్ రైసే వస్తుందన్న రాష్ట్రం
కొనుగోలుపై స్పష్టతివ్వని ఎఫ్‌సీఐ అధికారులు
మరోసారి సమావేశం కావాలని నిర్ణయం
ఇప్పుడు ధాన్యాన్ని బండి సంజయ్ కొనిపిస్తడా?
బీజేపీ ఎంపీని నిలదీస్తున్న రాష్ట్ర రైతాంగం
హైదరాబాద్, ఫిబ్రవరి 25 : యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్రం అదే మొండి వైఖరిని అవలంబిస్తున్నది. యాసంగిలో ఉత్పత్తి అయ్యే బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) కొనుగోలు చేయబోమని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) మరోసారి స్పష్టం చేసినట్టు తెలిసింది. శుక్రవారం అన్ని రాష్ర్టాల పౌరసరఫరాల కమిషనర్లతో ధాన్యం కొనుగోలుపై ఎఫ్‌సీఐ సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ తీసుకోబోమని తేల్చి చెప్పినట్టు సమాచారం. తెలంగాణలో యాసంగిలో బాయిల్డ్ రైస్ మాత్రమే ఉత్పత్తి అవుతుందని వివరించినప్పటికీ ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. దీనిపై చర్చించేందుకు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే చాలా పరిమిత స్థాయిలో బాయిల్డ్ రైస్ విత్ ఫోర్టిఫైడ్ రైస్ తీసుకుంటామని కేంద్రం సూత్రప్రాయంగా చెప్పినట్టు తెలిసింది. ఇది రెండుమూడు లక్షల టన్నులకు మించకపోవచ్చని అధికారులు తెలిపారు. ఎఫ్‌సీఐ ఇంత తక్కువ తీసుకుంటే మిగిలిన ధాన్యం పరిస్థితి ఏంటనేది ప్రశ్నగా మారింది.
ఈ యాసంగి దిగుబడి అంచనా 24 లక్షల టన్నులు
ప్రస్తుత యాసంగిలో రాష్ట్రంలో సుమారు 35 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దీని ప్రకారం సుమారు 24 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుంది. ఎఫ్‌సీఐ రెండుమూడు లక్షల టన్నులు తీసుకొంటే మిగిలిన 20-22 లక్షల టన్నుల బియ్యం ఏం చేయాలని రాష్ట్ర అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. కేంద్రం మొత్తం బియ్యం కొనుగోలు చేస్తామని హామీ ఇస్తేనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో ముందుగా ప్రకటించినట్టుగానే కొనుగోలు కేంద్రాలు తెరువకూడదని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ యాసంగిలో దేశవ్యాప్తంగా 42.92 లక్షల టన్నుల బియ్యం కొనుగోలు చేసే అవకాశం ఉన్నదని ప్రకటించింది. సమావేశం అనంతరం ఈ మేరకు పీఐబీ ద్వారా ప్రకటన విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 25 లక్షల టన్నులు తీసుకోనున్నది. ఏపీ ప్రభుత్వం బాయిల్డ్ రైస్ ఇస్తుందా? రా రైస్ ఇస్తుందా? అనే అంశంపై స్పష్టత లేదు. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రలో ధాన్యం కొనుగోలుపై ఇంకా స్పష్టత రాలేదు.
సాధ్యం కాని దాని కోసం మొండిపట్టు
యాసంగిలో తెలంగాణలో అధిక శాతం బాయిల్డ్ రైస్ మాత్రమే ఉత్పత్తి అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి, ఎఫ్‌సీఐకి తెలుసు. అయినా రా రైస్ కోసం పట్టుబట్టడం ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. యాసంగి ధాన్యాన్ని రా రైస్‌గా మార్చాలంటే 50 శాతం నూక అవుతుంది. ఈ నష్టాన్ని భరించేందుకు కేంద్రం ముందుకు రావడం లేదు. తెలంగాణలో వ్యవసాయం ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నది. ఈ సమయంలో కేంద్రం కక్ష కట్టినట్టు వ్యవహరించడం దారుణమని రైతులు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరితో రాష్ట్ర రైతులు నష్టపోవద్దన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ వరి వేయొద్దని రైతులకు సూచిస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరి పంటే వేయాలని రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ‘ప్రభుత్వం ధాన్యం ఎందుకు కొనదో చూస్తం, మెడలు వంచి కొనిపిస్తం’ అంటూ ప్రగల్బాలు పలికారు. ఇప్పుడు బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేయించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.