వనపర్తి, జూలై 31 (నమస్తే తెలంగాణ): రైతు బిడ్డ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తే కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు కండ్లు మండుతున్నాయని, అందుకే వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టుమని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేక బీజేపీకి ఓటేస్తే రైతులు ఉరి వేసుకొనే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. సామాన్యుల సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓర్వలేకే విమర్శలు చేస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణను హరిత రాష్ట్రంగా మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికీ గొప్ప ప్రాజెక్టు అని నిరంజన్‌రెడ్డి స్పష్టంచేశారు.
వనపర్తి జిల్లా మదనాపురం దంతనూర్ గ్రామంలో గోదాం, దుకాణ సముదాయాలకు ఆదివారం మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న పథకాలు విజయవంతమై ప్రజల మన్ననలు పొందుతుంటే ఓర్వలేకనే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్లో రైతుబంధు, రైతుబీమా, సాగుకు ఉచిత కరెంటు వంటి సంక్షేమ కార్యక్రమాలు లేవని చెప్పారు. అక్కడి రైతులను మోదీ పట్టించుకోవడం లేదని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడి రైతులకు ఇబ్బందని అన్నారు. ఇప్పటికీ వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించాలని రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి తెస్తున్నదని దుయ్యబట్టారు. తెలంగాణలో రైతులకు ఉచిత కరెంటు అందిస్తే కేంద్రానికి ఎందుకు కండ్లమంట? అని ప్రశ్నించారు.
సామాన్యులకు ధరల మోత
కేంద్రంలోని బీజేపీ పాలనలో ధరల మోతతో సామాన్యుడు కుదేలైపోతున్నాడని మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే నాటికి వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.385 ఉండగా ప్రస్తుతం రూ.1,180కి చేరింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఏడాదిలోనే పెట్రోల్, డీజిల్ ధరలను 82 శాతం పెంచారని దుయ్యబట్టారు. జీఎస్టీతో రాష్ర్టాల ఆదాయం కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ నుంచి రూ.3.62 లక్షల కోట్లు జీఎస్టీ పేరుతో తన్నుకుపోయిన కేంద్రం.. ఇందులో రాష్ర్టానికి రావాల్సిన వాటాలో సగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. పాలు, పెరుగు మీద పన్నులు విధించిన ఘనత మోదీకే దక్కిందని ఎద్దేవాచేశారు. అవసరమైతే తల వెంట్రుకలకు కూడా పన్ను వేస్తారేమోనని చురకలంటించారు. బ్యాంకులను ముంచిన కార్పొరేట్ గద్దలు చెల్లించాల్సిన రూ.6 లక్షల కోట్లను మాఫీ చేసిన మోదీ.. ట్యాక్సులతో సామాన్యుల బతుకులను ఛిద్రం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. 18 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణ తరహా పథకాలు అమలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ మీద పోరాటం చేయడానికి వణుకుతున్న రాహుల్‌గాంధీ.. కేసీఆర్ మీద విమర్శలు చేస్తున్నాడన్నారు. 35 లక్షల ఎకరాల సాగుభూమి ఉన్న పాలమూరుకు కేవలం లక్ష ఎకరాలకు నీళ్లిచ్చే జూరాల ప్రాజెక్టును నాలుగు దశాబ్దాల పాటు సాగదీశారని చెప్పారు.
మూడేండ్లలో గోదావారిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే మొదలు పెట్టినప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీలు విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన శ్రీశైలం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు చాలాసార్లు మునిగాయన్నారు. ప్రకృతి విపత్తుల వల్ల పంపుహౌస్ మునిగిపోతే రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. గుజరాత్లో 700 కిలోమీటర్లు రోడ్డు మార్గాన తిరిగానని, ఎక్కడా ఒక్క రైతుకు ప్రభుత్వం సాయం చేసిన జాడ లేదన్నారు.
అన్నం పెట్టే రైతుకు చేయూతనిస్తే అందరికీ అండగా ఉంటారన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.