KCR | కేంద్రంలోని మోదీ సర్కారు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో నిర్వీర్యం చేస్తుంటే.. తెలంగాణలోని కేసీఆర్ సర్కారు వాటి పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్నది. జల విద్యుత్తు, గ్యాస్ ఆధారిత విద్యుత్తు ప్రాజెక్టులకు యంత్రపరికరాలను అందజేసే ప్రతిష్ఠాత్మక బీహెచ్ఈఎల్ను ప్రైవేటీకరించేందుకు కేంద్ర సర్కారు పావులు కదుపుతున్నది. అదే సమయంలో బీహెచ్ఈఎల్కు మూడు థర్మల్ విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణ పనులు అప్పగించి తెలంగాణ సర్కారు మద్దతుగా నిలిచింది. ఎల్ఐసీలోని వాటాలు అమ్మి జీవిత బీమాకే మోదీ సర్కారు ధీమా లేకుండా చేస్తే.. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బీమాను అప్పగించి సీఎం కేసీఆర్ బీమా సంస్థకు అండగా నిలిచారు.
హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్కో ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరిస్తూ ముందుకు సాగుతుంటే.. తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం వాటికి వీలైనంత వరకు చేయూతనందిస్తున్నది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) ఇందుకు సాక్షీభూతంగా నిలుస్తున్నది. జల విద్యుత్తు, గ్యాస్ ఆధారిత విద్యుత్తు ప్రాజెక్టులకు యంత్రపరికరాలను అందజేసే ప్రతిష్ఠాత్మక సంస్థ బీహెచ్ఈఎల్. ఇందులో గ్యాస్ టర్బైన్లు, ఆయిల్ రిగ్గులు, కంప్రెసర్లు, బాయిలర్లు, హీటర్లు, భారీ పంపులు తయారవుతాయి. గతం లో కేంద్ర ప్రభుత్వాలు దేశంలో కొత్తగా ఏర్పాటుచేసే జల విద్యుత్, గ్యాస్ ఆధారిత విద్యుత్తు ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్డర్లను బీహెచ్ఈఎల్కు అప్పగించేవి. ఇరిగేషన్ ప్రాజెక్టులకు అవసరమయ్యే పంపుల ఆర్డర్లను ఈ సంస్థకే ఇచ్చేవారు. మోదీ సర్కారు కొలువుదీరాక బీహెచ్ఈఎల్కు ఆర్డర్లు నిలిచిపోయాయి. దీంతో ఈ సంస్థ ఓపెన్ టెండర్లలో పాల్గొని, పనులు దక్కించుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. గతంలో వేలాదికోట్ల లాభాలు ఆర్జించిన బీహెచ్ఈఎల్ నష్టాలబాట పట్టింది.
‘ఆత్మనిర్భర్ భారత్’ అంటూ గొప్పలు చెప్పే మోదీ బీహెచ్ఈఎల్కు ఎందుకు ఆర్డర్లు ఇవ్వడం లేదని కార్మిక సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. మూడేండ్లుగా బీహెచ్ఈఎల్లో కొత్త ఉద్యోగాల నియామకాలు నిలిచిపోయాయని, స్థానిక యువతకు ఉద్యోగాలు లభించడం లేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రతిష్ఠాత్మక బీహెచ్ఈఎల్ సంస్థను ప్రైవేటీకరించడంలో భాగంగానే మోదీ సర్కారు ఈ కుట్రలకు తెరలేపిందని మండిపడ్డారు. ఇదిలా ఉండగా, మోదీ సర్కారు చేతిలో నిర్వీర్యమయ్యే దశలో ఉన్న బీహెచ్ఈఎల్కు సీఎం కేసీఆర్ పునరుజ్జీవం పోశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన పంపుల ఆర్డర్లను ఆ సంస్థకే ఇచ్చారు. తెలంగాణలో నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి మిషనరీ ఆర్డర్‌ను అప్పగించారు. దీంతో బీహెచ్ఈఎల్ నష్టాల ఊబిలోంచి బయటపడుతున్నది. సీఎం కేసీఆర్ వల్లే ప్రస్తుతం బీహెచ్ఈఎల్ మనుగడ సాగిస్తున్నదని కార్మిక సంఘాలు ఆనందం వ్యక్తంచేస్తున్నాయి.
బీహెచ్ఈఎల్కు ‘థర్మల్’ వెలుగులు
తెలంగాణలో వెలుగు జిలుగులు చిమ్మేందుకు చేపట్టిన మూడు థర్మల్ విద్యుత్తు ప్రాజెక్టు పనులను కేసీఆర్ సర్కారు బీహెచ్‌ఈఎల్‌కే అప్పగించారు. తొలుత ప్రారంభించిన కొత్తగూడెం స్టేజ్-7 ప్రాజెక్టు (800 మెగావాట్లు) నిర్మాణ పనులను రూ. 3,810 కోట్లకు బీహెచ్ఈఎల్కు ఇచ్చారు. అనంతరం మణుగూరు లో చేపట్టిన భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (4×270 మెగావాట్లు) ప్రాజెక్టునుకూడా బీహెచ్‌ఈఎల్‌కే అప్పగించారు. దక్షిణాదిలోనే అతి పెద్దదైన అల్ట్రా సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు యాదాద్రి (5×800 మెగావాట్లు) పనులను కూడా బీహెచ్‌ఈఎల్‌కే ఇచ్చారు. ఆ పనులను తమకే ఇవ్వాలని దిగ్గజ ప్రైవేట్ కంపెనీలు ఒత్తిడి తెచ్చినా.. బీహెచ్ఈఎల్కు పునరుజ్జీవనం పో సేందుకే సీఎం కేసీఆర్ మొగ్గుచూపారు. 3 థర్మల్ పవర్ స్టేషన్ల నిర్మాణానికి సంబంధించి మొత్తం రూ. 29,233 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులను అప్పగించడంతో.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న బీహెచ్ఈఎల్ సంస్థ నిలదొక్కుకొన్నది. ఒక్కో ప్రాజెక్టును నిర్మిస్తూ వస్తున్నది. ఇప్పటికే కొత్తగూడెం స్టేజ్-7, భద్రాద్రి ప్రాజెక్టులను పూర్తిచేసింది. కరోనా కారణంగా యాదాద్రి పనులు కాస్త ఆలస్యమైనా.. ప్రస్తుతం వేగం పుంజుకొన్నది.
రైతుబీమాతో ఎల్ఐసీకి ధీమా
భారత ప్రభుత్వరంగ బీమా సంస్థ అయిన ఎల్ఐసీలోనూ కేంద్ర సర్కారు వాటాను అమ్మకానికి పెట్టింది. ఎల్ఐసీ ప్రైవేటీకరణకు తలుపు లు తెరిచింది. దీంతో లాభాల్లో ఉన్న జీవిత బీమా సంస్థ నష్టాలబాటపట్టింది. మోదీ సర్కా రు చేతిలో ధీమాలేకుండాపోయిన బీమాసంస్థకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు బీమా పథకం అండగా నిలిచింది. రైతుబీమా అమలుకు కేసీఆర్ సర్కారు ఎల్ఐసీని ఎంచుకొన్నది. అనేక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించినప్పటికీ.. ప్రభుత్వ రంగ సంస్థలకు అండగా నిలువాల్సిన అవసరాన్ని గుర్తించిన కేసీఆర్ మరోమాట లేకుండా ఎల్ఐసీవైపే మొగ్గుచూపారు. దీంతో గడిచిన ఐదేండ్లలో ఎల్ఐసీకి తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ.5,384 కోట్ల ప్రీమియాన్ని చెల్లించింది. 2018-19 నుంచి 2022-23 వరకు ప్రతి ఏటా సగటున 34 లక్షల మంది రైతులకు ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తున్నది. దీంతో రైతు ఏ కారణంతో చనిపోయినా వెంటనే రూ. 5 లక్షల మొత్తా న్ని పరిహారంగా ఎల్ఐసీ అందిస్తున్నది. ఐదేండ్లలో 93,306 మంది రైతులు మరణిస్తే.. ఎల్ఐసీ రూ. 4,665.30 కోట్లను చెల్లించింది.