Vande Bharat | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): మనదేశంలో పేదలు, సామాన్యులకు అతి తక్కువ ఖర్చుతో లభించే ప్రయాణ మార్గం రైల్వే. రైళ్లలో ప్రయాణించేవారిలో అత్యధికులు వీరే. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ వర్గాల కోసం ప్రభుత్వాలు అనేక రకాల రైళ్లను ప్రవేశపెట్టాయి. కానీ, 2014లో కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిస్థితి తిరగబడింది. రైల్వే ఆధునీకరణ పేరుతో సామాన్యుల రైళ్లను రద్దుచేసి, అత్యంత ఖరీదైన రైళ్లను మోదీ సర్కారు ప్రవేశపెట్టింది.
ఒక్క మన రాష్ట్రం మీదుగా వెళ్లేవాటిలోనే 76 ప్యాసింజర్ రైళ్లను కేంద్రం రద్దుచేసింది. ముఖ్యంగా ప్యాసింజర్ల ఊసే ఎత్తడం లేదు. ప్రజల నుంచి ఎంతో ఆదరణ పొందిన 12 స్లీపర్ కోచ్ రైళ్లను కూడా శాశ్వతంగా రద్దు చేసింది. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్సీఆర్ ఆధ్వర్యంలో ప్రస్తుతం నడుస్తున్న 46 ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అదనపు చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇవి చాలవన్నట్టు పలు స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామన్న పేరుతో.. వాటిలో టిక్కెట్ ధరపై దాదాపు 30 నుంచి 50 శాతం వరకు అదనపు చార్జీ వసూలు చేస్తున్నారు.
వందేభారత్‌లో అధిక ధరలు
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే సాధారణ రైళ్లలో స్లీపర్ కోచ్‌లో టికెట్ ధర రూ.390 ఉంటే.. ఏసీలో రూ.960 ఉన్నది. ప్రధాని మోదీ శనివారం ప్రారంభించిన వందేభారత్ రైల్లో టికెట్ ధర రూ.3030. 660 కిలోమీటర్లు 8.30 గంటల పాటు రైల్లో కూర్చొనే వెళ్లాలి. ఇందులో స్లీపర్ కోచ్‌లు లేవు. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు అన్ని గంటలు కూర్చొని ప్రయాణం చేసే అవకాశాలుండవని ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు.