హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): పెంచిన ఎరువుల ధరలను తగ్గించేదాకా పోరాటం చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. మోదీ సర్కారు చేస్తున్న అన్యాయంపై సీఎం కేసీఆర్ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారని అన్నారు. దేశంలో అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని నంబర్ వన్‌గా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు. ఆయనపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే బీజేపీ నేతలను ప్రజలు ఉరికిచ్చికొట్టుడు ఖాయమని తెలిపారు. గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీలు గంగాధర్‌గౌడ్, ఎల్ రమణ, దండె విఠల్, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను జైల్లో పెడతామని పేర్కొనటాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. సిగ్గూఎగ్గూ లేకుండా బీజేపీ నేతలు పిచ్చికూతలు కూస్తున్నారని మండిపడ్డారు. మోదీ హయాంలో దేశం దివాళా తీసిందని వెల్లడించారు. బీజేపీ నేతలకు వ్యవసాయం అంటేనే తెలియదని.. కానీ, దేశ వ్యవసాయ రంగానికే కొత్త దారి వేసిన నాయకుడు సీఎం కేసీఆర్ ఆని కొనియాడారు. రైతులను నకిలీ విత్తనాల నుంచి కాపాడిన మహానుభావుడని శ్లాఘించారు. రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించినా, సరఫరా చేసినా పీడీ యాక్ట్ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ పిలుపుతో దేశ రైతాంగం బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధమవుతున్నదని అన్నారు. ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలు ఉన్నాయని కేంద్రం సాగుచట్టాలను తాత్కాలికంగా రద్దు చేసిందని, ఎన్నికల తర్వాత అంతకంటే దుర్మార్గమైన చట్టాలను తెచ్చేందుకు రంగం సిద్ధం చేసిందని అన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నదని మోదీ సర్కారుపై ఫైర్ అయ్యారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన గతాన్ని మరిచి, రెచ్చిపోయి మాట్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ ఎడారిగా మారిందని టీడీపీలో ఉన్నపుడు ఆందోళన చేసిన రేవంత్.. కాంగ్రెస్‌లో చేరగానే వాస్తవాలు మార్చుకొన్నారని మండిపడ్డారు. నాడు వ్యవసాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే 7 గంటల కరెంట్ నాణ్యమైంది కాకపోవడంతో మోటర్లు కాలి, ట్రాన్స్ఫార్మర్లు పేలి రైతులు అరిగోస పడితే కాంగ్రెస్‌పై అంతెత్తు ఎగిరింది ఇదే రేవంత్ కాదా? అని మంత్రి ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ అని, అటువంటి మహానాయకుడిపై విమర్శలు చేస్తే పుట్టగతులు లేకుండా పోతారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు పిచ్చికుక్కల్లా మొరగవద్దని పేర్కొన్నారు.