Telangana | హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి మోదీ సర్కారు ఇచ్చింది శూన్యమనే చెప్పవచ్చు. తెలంగాణకు తొమ్మిదేండ్లలో రూ.1.25 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారులు మంజూరు చేసిన కేంద్రం.. ఖర్చు చేసింది మాత్రం రూ.20 వేల కోట్లే. ఇదే సమయంలో రాష్ట్రంలోని వాహనదారుల నుంచి టోల్ రూపంలో రూ.9 వేల కోట్లకుపైగా వసూలు చేసింది. పెట్రోలు, డీజిల్ అమ్మకాల ద్వారా వసూలు చేసిన రోడ్డు సెస్సు దీనికి అదనం. కొత్త జాతీయ రహదారుల ఏర్పాటు, రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయడం లాంటి పనులను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ చేపడుతుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో ప్రధాన ప్రాంతాలను కలిపే 14 స్టేట్ రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించి, నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు, డీపీఆర్ సమర్పించింది. మోదీ సర్కారు అవసరమనుకున్న రహదారులకే అనుమతులు మంజూరు చేసింది. తొమ్మిదేండ్లలో రూ.1.25 లక్షల కోట్ల విలువైన పనులు మంజూరు చేసి, అందులో రూ.20 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేయడం తెలంగాణ పట్ల మోదీ సర్కారు వివక్షను స్పష్టం చేస్తున్నది.
వాస్తవానికి కేంద్రం జాతీయ రహదారుల అభివృద్ధికి తమ ఖజానా నుంచి ఖర్చుచేసేది శూన్యమే. రోడ్ల నిర్మాణ పనులు నిర్వహించే ఏజెన్సీలే టోల్ ట్యాక్స్ రూపంలో వాహనదారుల నుంచి సొమ్ము వసూలు చేసుకుంటాయి. కేంద్రం రోడ్ సెస్సు రూపంలో పెట్రోల్, డీజిల్పై ప్రతి లీటర్కు రూ.30 చొప్పున ఏటా రాష్ట్రం నుంచి రూ.వేల కోట్లు వసూలు చేస్తున్నది. రాష్ర్టాల నుంచి సాలీనా రూ.5 లక్షల కోట్లు పిండుకుంటున్నది. దీన్నిబట్టే కేంద్రం తెలంగాణ నుంచి ఎన్ని నిధులు వసూలు చేసిందో, రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ఎంతిచ్చిందో అర్థం చేసుకోవచ్చు.