హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను దాదాపు నెరవేర్చాం’.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో మంగళవారం చేసిన ప్రకటన ఇది. ఈ ప్రకటనపై తెలంగాణ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. తొమ్మిదేండ్లుగా విభజన హామీలు నెరవేర్చుకుండా తప్పించుకుంటున్న కేంద్రం.. ఇప్పుడు ఏకంగా తీర్చేశామంటూ ప్రకటనలు చేసుకోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా విభజన చట్టంలో పొందుపరిచినా.. కేంద్రం పట్టించుకోని హామీల జాబితాను వివరిస్తున్నారు.
సంప్రదింపులు చేసి ఏం తేల్చారు?
మధ్యవర్తిగా ఉంటూ అనేక అంశాలపై తెలంగాణ, ఏపీ రాష్ర్టాలతో 31 సార్లు సమీక్షలు జరిపామని పార్లమెంట్లో కేంద్రం పేర్కొన్నది. కేవలం నామమాత్రానికే సంప్రదింపులు తప్ప వీటి వల్ల ఒరిగిందేమీ లేదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకు నీటి కేటాయింపులనే ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొంటున్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో జరిపిన తాత్కాలిక కేటాయింపులనే ఇప్పటికీ ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. బేసిన్లో తెలంగాణకు సగం వాటా రావాలని రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతున్నా ఎందుకు పరిష్కారం చూపడం లేదని నిలదీస్తున్నారు. దీంతోపాటు షెడ్యూల్ 9, 10 లోని సంస్థల విభజన తొమ్మిదేండ్లయినా త్రిశంకు స్వర్గంలోనే ఎందుకు ఉన్నదన్నది విశ్లేషకుల ప్రశ్న. చర్చలు, కమిటీలు, కాలయాపనలు తప్ప జరిగిందేమీ లేదని మండిపడుతున్నారు. 2014-15లో తెలంగాణకు రావాల్సిన సీఎస్ఎస్ నిధులు రూ.495 కోట్లను కేంద్రం పొరబాటున ఏపీకి బదలాయించింది. వాటిని వెనక్కి ఇప్పించాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. రూ.500 కోట్లే వెనక్కి తేలేనివారు వందల సార్లు సమీక్షలు, సంప్రదింపులు చేసినా ఫలితం ఏముంటుందని తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు.
1) బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ
ఖమ్మంలోని బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని కేంద్రం స్పష్టంగా విభజన చట్టంలో పేర్కొన్నది. కానీ ఇంతవరకు ఎలాంటి ముందడుగు పడలేదు. అడిగితే కుంటి సాకులు చెప్తున్నది.
2) గిరిజన కేంద్రీయ విశ్వ విద్యాలయం
ములుగులో గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం హామీ తొమ్మిదేండ్లుగా మూలన పడి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం 331 ఎకరాలను, తాత్కాలిక వసతి కోసం భవనాలను కేటాయించినా కేంద్రం అడుగు ముందుకు వేయడం లేదు. కేవలం డీపీఆర్‌ను సిద్ధం చేసింది.
3) రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని పెడతామని కేంద్రం స్వయంగా విభజన చట్టంలో హామీ ఇచ్చింది. దీనిని సుమారు తొమ్మిదేండ్లు నానబెట్టి.. చివరికి వ్యాగన్ ఉత్పత్తికి అంగీకరించింది. ఇటీవలే ప్రధాని మోదీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.
4) వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు
రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఏటా రూ.450 కోట్లు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. తొమ్మిదేండ్లలో కేవలం నాలుగేండ్లకు మాత్రమే నిధులు ఇచ్చింది. ఇంకా 2014-15, 2019-20, 2021-22, 2022-23కు సంబంధించిన ఐదేండ్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
5) ప్రాజెక్టుకు జాతీయ హోదా
తెలంగాణలో ఏదేని ఒక నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుకుగానీ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకుగానీ జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు కోరినా ఫలితం లేదు.