హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగాన్ని విస్మరించడం పట్ల ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ కేవలం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశ పెట్టారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఆరోపించారు.ఈ బడ్జెట్ ద్వారా విద్యార్థులు, యువకులకు ఏ ప్రయోజనం లేదన్నారు.
బడ్జెట్లో విద్యకు 10 శాతం నిధులు కేటాయించాలని కొఠారి కమిషన్ చెప్పినా, మోదీ ప్రభుత్వం విద్యారంగం పట్ల చిన్న చూపు చూసిందని విమర్శించారు. కనీసం 5 శాతం నిధులు కూడా కేటాయించకపోవడం శోచనీయమన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రూ.1,12,899 కోట్లు కేటాయించిందన్నారు. పాఠశాల విద్య, అక్షరాస్యతకు రూ.68,804.85 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు రూ.44,094.62 కోట్లు కేటాయించిందని తెలిపారు.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బడ్జెట్లో విద్యకు నిధులు తగ్గిస్తూ వస్తుందని వారు ఆరోపించారు. డిజిటల్ విద్య, డిజిటల్ లైబ్రరీ ప్రాధాన్యత అంటున్న కేంద్రం ఆ దిశగా చర్యలు తీసుకోలేదని అన్నారు. పేదవారికి విద్యను దూరం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదన్నారు. విద్యార్థులకు సంబంధించిన స్టేషనరీ వస్తువులపై జీఎస్టీ ఎత్తివేయడం గాని, తగ్గించడం గాని చేయలేదన్నారు.
తెలంగాణ విభజన హామీల్లో ఉన్న ట్రిపుల్ ఐటీ , జిల్లాకో నవోదయ పాఠశాలల, కేంద్రీయ విద్యాలయలు , గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఊసేలేదని మండిపడ్డారు. యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్, విదేశీ యూనివర్సిటీలకు ప్రాధాన్యం ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం అవలంభిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఏఐఎస్ఎఫ్ ఉద్యమిస్తుందని వారు వెల్లడించారు.