హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ), అమీర్‌పేట: కేంద్ర, రాష్ర్టాల మధ్య సఖ్యతతోనే దేశాభివృద్ధి సాధ్యమని, కానీ మోదీ తీరుతో సత్సంబంధాలు దెబ్బతింటున్నాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని బీపీఆర్విఠల్ ఆడిటోరియం లో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ‘ఫెడరలిజం భవిష్యత్తు-కేం ద్ర, రాష్ర్టాల సంబంధాలు’ అంశంపై సెమినార్ నిర్వహించారు.
వినోద్ మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ నడుచుకొంటున్నదని తెలిపారు. ప్రధాని మోదీ ఒంటెత్తు విధానాలతో దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నదని, ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పన్నుల రాబడి పెరిగిందని చెప్తున్న మోదీ.. రాష్ర్టాల వాటాలు మాత్రం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. తెలంగాణకు స్వయం ప్రతిపత్తి అవసరమని పోరాడిన వ్యక్తి జయశంకర్ అని కొనియాడారు. ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్న కేంద్రం వైఖరిని ప్రజలు ప్రశ్నించాలన్నా రు. ప్రస్తుతం సమాఖ్య స్ఫూర్తి ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. సెమినార్లో సెం టర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ డైరెక్టర్, ప్రొఫెసర్ రేవతి తదితరులు పాల్గొన్నారు.