ఎల్లారెడ్డి, జూన్ 18: రాష్ర్టాన్ని పాలిస్తున్న రేవంత్‌రెడ్డి, దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోదీ ఇద్దరూ రైతులను మోసం చేస్తున్నారని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆరోపించారు. వీరిద్దరూ తోడు దొంగలేనని విమర్శించారు. యూరియా యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. యూరియా యాప్‌తో రైతులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రైతులను రాజుగా చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు వంటి పథకాలెన్నో అమలు చేసిందని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బీమా సంస్థకు డబ్బులు కట్టకపోవడంతో రైతుబీమా పథకం ఆగిపోయిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంట్ ఉంటే, రేవంత్ హయాంలో 8 గంటలు కూడా ఉండటం లేదని విమర్శించారు. రైతులు పంటలు పండించడానికి మూడు నెలలు పడితే, వాటిని అమ్ముకోవడానికి మూడు నెలలు పడుతున్నదని మండిపడ్డారు.