హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : కృత్రిమ మేధ (ఏఐ) ఐటీ రంగంపై ఆశలు పెట్టుకున్న యువత కలలను ఛిద్రం చేస్తున్నది. ఏఐ ఆధారిత సాంకేతికత ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటున్న నేపథ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో మానవ వనరుల అవసరం తగ్గిపోతున్నది. ఫలితంగా వేల సంఖ్యలో యువత ఉపాధిని కోల్పోతున్నారు. ఇంతకాలం లక్షల రూపాయలు ధారపోసి, ఎంతో కష్టపడి చదివిన చదువు తమకు ఉపాధిని కల్పించలేకపోతున్నదని, తమ చదువుకు తగిన పనిని ఓ రోబో లేదా ఏఐ ఆధారిత పరికరం పూర్తి చేస్తున్నదని తెలిసి యువత దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ దయనీయమైన స్థితిలోనే తెలంగాణకు చెందిన ఓ జంట ఇటీవల బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడింది.
ఐదంకెల జీతం ఆశతో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిన భానుచందర్ రెడ్డి (33), షాజియా సిరాజ్ (32) జంటను ఏఐతో వచ్చిన టెక్నాలజీ భూతం బలి తీసుకున్నది. అమెరికా ఉద్యోగం కోల్పోయిన భానుచందర్, భార్య షాజియాతో ఉద్యోగ వేటలో బెంగళూరు చేరారు. షాజియా ఇటీవల ఐబీఎం కంపెనీలో చేరినప్పటికీ ఏడాది కాలంగా భానుచందర్ మాత్రం ఉద్యోగ వేటలో దక్కామొక్కీలు తింటున్నాడు. ఏ కంపెనీకి వెళ్లినా ‘నీవు చేయదగిన పనిని మాకు ఏఐ చేసి పెడుతున్నది’ అన్న సమాధానమే వినిపించింది. ఇన్నాళ్లు పుస్తకాలతో నేర్చుకున్న మేథస్సు కంటే కృత్రిమ మేథతో వచ్చిన కోడ్ గొప్పదని తేలిపోయింది. ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఆ జంటను కులాంతర వివాహం కారణంగా కుటుంబ సభ్యులు సైతం దూరం పెట్టారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన ఆ జంట బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తున్నది.
ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకొని, కులాంతర వివాహంతో ఒక్కటైన తెలంగాణకు చెందిన ఈ యువ టెకీలు వేగంగా మారిపోతున్న టెక్నాలజీని తట్టుకోలేకపోయారు. మతాలు వేరైనా, సమాజం వేలెత్తి చూపినా ఒకరికొకరు తోడు నిలిచారు. కానీ కొన్ని నిమిషాల పాటు వారి మధ్య సాగిన సంభాషణ వారి జీవితంలో కల్లోలం రేపింది. అమెరికా ప్రాజెక్టుతో జీవితాన్ని ఇచ్చిన ఆ ఉద్యోగాన్ని టెక్నాలజీలో వచ్చిన ఆల్గారిథమ్ లాగేసుకుంది. దీంతో సామాజిక ఒంటరితనం, వారి ప్రేమను అంగీకరించని సమాజం ఎదుట అభద్రతా భావం, రేపటి నుంచి ఎవరు ఆదుకుంటారు? అనే భయాందోళన.. డిజిటల్ ప్రపంచంలో మనుషుల కంటే యంత్రాలకే విలువ ఉంటే, తమ లాంటి సామాన్యులకు ఇక్కడ చోటు లేదని తేల్చేశాయి. ఉన్న చోటనే ఉరి వేసుకుని భర్త శిలగా మారగా, భర్త లేని లోకంలో తానూ ఉండలేనంటూ ఆ భార్య అందనంతా ఎత్తు నుంచి నేలకు జారి ప్రాణాలు వదిలింది. ఆధునిక యుగంలో వాడుతున్న యాప్లూ, ప్రతి ఏఐ టూల్ వెనుక ఎంతోమంది టెక్నోక్రాట్ల మేథో శ్రమ ఉంటే… అదే టెక్నాలజీ ఒక మనిషి మేథో శక్తిని అవుట్ డేటెడ్గా మార్చి వేసి నిర్యీరుడిని చేస్తున్నది. ఈ టెకీ జంట ఆర్థిక ఇబ్బందుల కంటే మానసిక సంక్షోభంతో కొట్టుమిట్టాడిన రోజులే ఎక్కువగా ఉన్నాయనీ ఈ ఘటన వెల్లడిస్తున్నది. ఎంతో వేగంగా దూసుకుపోతున్న ఏఐ టెక్నాలజీతో పోటీపడి అప్గ్రేడ్ కాలేని ఎంతోమంది సామాన్య టెకీల దయనీయ స్థితికి ఈ మరణాలు ఓ హెచ్చరికగా నిలుస్తున్నాయి.
రెండున్నరేండ్ల కిందట వివాహం చేసుకున్న ఈ జంట తొలినాళ్లలో హైదరాబాద్లోనే నివాసం ఉన్నారు. భానుచందర్ తండ్రి రాజకీయ ప్రాబల్యం కలిగిన వ్యక్తి కావడంతో తమ ప్రేమకు రక్షణ లేదని తెలిసి, వారు కొన్ని నెలల కిందటే బెంగుళూరుకు మారినట్టు సమాచారం.