KU | హనుమకొండ చౌరస్తా: కాకతీయ విశ్వవిద్యాలయ కే-హబ్ ఆధ్వర్యంలో ఎంపికైన విద్యార్థులకు టీ-హబ్ (T-Hub) ప్రతినిధులతో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం విశ్వవిద్యాలయ సెనెట్హాల్లో నిర్వహించారు. కే-హబ్ డైరెక్టర్ ఆచార్య టీ సవితా జ్యోత్స్నసారథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా టీ-హబ్ ప్రతినిధి బాల మురళి భాస్కరన్ విద్యార్థులకు స్టార్టప్ మెంటార్షిప్, ఐడియా జనరేషన్, ఐడియా వ్యాలిడేషన్ తదితర అంశాలపై ఆచరణాత్మక శిక్షణ అందించారు. విద్యార్థులు తమ ఆలోచనలను వ్యాపార అవకాశాలుగా ఎలా మలచుకోవాలి, ఒక ఆలోచనలోని కొత్తదనం, సృజనాత్మకత, సాధ్యాసాధ్యాలను ఎలా గుర్తించాలి అనే అంశాలను వివిధ ప్రత్యక్ష ఉదాహరణలతో వివరించారు.
విద్యార్థులు స్టార్టప్‌లు, వ్యాపార ఆలోచనలకు సంబంధించిన పలు ప్రశ్నలను అడగగా, టీ-హబ్ ప్రతినిధులు వాటిని నివృత్తి చేశారు. ఆలోచనలను గుర్తించి, వాటికి సమర్థవంతమైన రూపకల్పన చేసి, మార్కెట్ (Market) అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసుకునే విధానాలపై అవగాహన కల్పించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇలాంటి 15 శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కే-హబ్ డైరెక్టర్ సవితా జ్యోత్స్న తెలిపారు. ఈ శిక్షణల ద్వారా విద్యార్థుల్లో వ్యాపార దృక్పథం, అంకుర సంస్థల స్థాపనపై అవగాహన, సృజనాత్మక ఆలోచనా శక్తి మరింత పెంపొందుతుందని ఆమె చెప్పారు. కార్యక్రమంలో కే-హబ్ సంయుక్త సంచాలకులు సిద్ధు, కిరణ్ పాల్గొన్నారు.