హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు తీరం నుంచి వాయవ్య దిశగా కదులుతున్నదని వాతావరణశాఖ వెల్లడించింది. రాబోయే 12 గంటల్లో నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో తెలుగు రాష్ర్టాలకు వాయుగుండం ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో రానున్న 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో నాగర్కర్నూల్, ఖమ్మం, యాదాద్రి-భువనగిరి, ములుగు, జోగులాంబ-గద్వాల, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసినట్టు తెలిపారు. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.