హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తన ద్రోణి కారణంగా ఈనెల 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. శనివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసినట్టు తెలిపింది.
గంటకు 30-40 కి.మీ వేగంతో అన్ని జిల్లాల్లో అక్కడక్కడ బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఆది, సోమ, మంగళవారాల్లో కూడా ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో నిర్మల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసినట్టు తెలిపింది.
అత్యధికంగా నిర్మల్ జిల్లా నిర్మల్ గ్రామీణ మండలంలో 2.87 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, సోన్‌లో 2.60 సెం.మీ, దిలావర్పూర్లో 2.28 సెం.మీ, లక్ష్మణ్‌చందాలో 2.19 సెం.మీ, నిర్మల్‌లో 2.15 సెం.మీ, ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో 2.64 సెం.మీ, బేలలో 2.42 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 2.36 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్టు పేర్కొన్నది. జూన్ 1నుంచి శుక్రవారం వరకు సాధారణ సగటు వర్షపాతం 151.2 మి.మీ నమోదు కావాల్సి ఉండగా, 145.9 మి.మీ నమోదైనట్టు వివరించింది. నిరుడు ఈ సమయానికి 178.3 మి.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.