హైదరాబాద్ : రాష్ట్రంలో నైరుతి రుతు పవనాలు చురుగ్గా ఉన్నాయి. దీంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 23 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ, మంగళవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా మహబూబ్నగర్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాల్పల్లి, నిర్మల్, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
ఉపరితల ద్రోణి ఆదివారం విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమల మీదుగా తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జనగాం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.