హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు బుధవారం ఈశాన్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. రాబోయే రెండు, మూడు రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నది. మధ్యప్రదేశ్ ఆగ్నేయ ప్రాంతాలపై ఒక ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో ఈనెల 30 వరకు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్జ్ జారీ చేసినట్టు వెల్లడించింది.
బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ తదితర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్టు తెలిపింది. గడిచిన 24 గంటల్లో ములుగు జిల్లా మల్లెపల్లిలో అత్యధికంగా 10.45 సెం.మీ, కుమ్రం భీంలో 6.54 సెం.మీ, నిర్మల్‌లో 4.55 సెం.మీ, వరంగల్‌లో 4.47 సెం.మీ, పెద్దపల్లిలో 4.2 సెం.మీ, ఆదిలాబాద్‌లో 3.85 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వివరించింది. ఈనెల సగటు సాధారణ వర్షపాతం ఇప్పటివరకు 101.7 మి.మీ కురువాల్సి ఉండగా, 84.9 మి.మీ మాత్రమే కురిసినట్టు తెలిపింది. దీంతో 17 మి.మీ లోటు ఏర్పడగా, గత ఏడాదితో పోలిస్తే మాత్రం ఇది 43శాతం అధిక వర్షపాతంగా ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.