హైదరాబాద్/సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో బుధవా రం భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని నారాయణపేట, ఏపీలోని నర్సాపూర్ నుంచి నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి వెళ్తుందని చెప్పారు. 3,4 రోజులలో కర్ణాటక, తెలంగాణ, కోస్తా లోని మరికొన్ని ప్రాంతాలలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారాయని తెలిపారు. రాబోయే 7 రోజులు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
గ్రేటర్‌కు ఎల్లో అలర్ట్
హైదరాబాద్‌లో బుధవారం ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షం పడింది. రాత్రి 8గంటల వరకు బేగంబజార్ ప్రాంతంలో అత్యధికంగా 8.55సెం.మీ వర్షపాతం నమోదైనట్టు టీఎస్‌డీపీఎస్ అధికారులు వెల్లడించారు. రాగల రెండు రోజుల్లో గ్రేటర్ లో మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీచేశారు. మరో వైపు పలుచోట్ల వాహనాలు నీట మునగడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.