ఇచ్చోడ, మే 16 : కేసీఆర్ హయాంలో పల్లె ప్రగతితో దేశంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచిన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) నేడు కాంగ్రెస్ పాలనలో అష్టకష్టాలు పడుతున్నదని మాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం ఉపాధిహామీ కూలీలతో కలిసి పని చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో నెల నెలా గ్రామాలకు నిధులు వచ్చేవని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో నిధులు లేక గ్రామాలు చెత్త కుప్పలుగా మారాయని ఆవేదన వ్యక్తంచేశారు.
గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు రాక సర్పంచ్లు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దేశానికి ఆదర్శంగా నిలిచి రాష్ట్రపతి, కేంద్ర మంత్రుల చేతుల మీదుగా ఎన్నో జాతీయ అవార్డులు తీసుకున్నామని గుర్తుచేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఉపాధి హామీ పనులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొన్నదని చెప్పారు. ఇప్పటికైనా పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.