హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తూ ఉద్యోగులు, సిబ్బంది ఒక్కొక్కరుగా ఆందోళనలకు దిగుతున్నారు. ఇప్పటికే ఆశావర్కర్లు ఆందోళబాట పట్టగా, సమగ్రశిక్ష ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. మోడల్ స్కూల్ టీచర్లు కూడా ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసొసియేషన్ (పీఎంటీఏ) ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఆందోళన కొనసాగుతుందని పీఎంటీఏ టీఎస్ అధ్యక్షుడు జగదీశ్, ప్రధాన కార్యదర్శి పోచయ్య స్పష్టంచేశారు.
సమస్యలను 15 రోజుల్లోగా పరిష్కరించాలని ప్రభుత్వానికి నోటీసు ఇచ్చినా స్పందన లేదని మండిపడ్డారు. మోడల్ స్కూళ్లను పాఠశాల విద్య డైరెక్టరేట్‌లో విలీనం, టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాల చెల్లింపు, ఒకే నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు సమయాల్లో రిక్రూట్ అయిన వారికి నోషనల్ సర్వీసు, హెల్త్‌కార్డుల మంజూరు, కారుణ్య నియామకాలు, పదోన్నతులు, సీపీఎస్ డెత్ గ్రాట్యు టీ, ఫ్యామిలీ పింఛన్, పెండింగ్ బకాయిల చెల్లింపుపై సర్కారు స్పందించాలని డిమాండ్ చేశారు. 12 నుంచి దశల వారీగా నిరసనలు నిర్వహించి, జనవరి 4న ఇందిరాపార్క్‌లో మహాధర్నా చేపడుతామని వెల్లడించారు.