కేసముద్రం, నవంబర్ 20: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామంలోని మాడల్ స్కూల్ వసతిగృహం నిర్వహణ అధ్వానంగా మారింది. గురువారం విద్యార్థినుల కోసం వండిన కిచిడీ(అల్పాహారం)లో పురుగులు కనిపించడంతో పస్తులుండాల్సి వచ్చింది. కొద్దిరోజుల నుంచి అల్పాహారం, మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉంటున్నాయని, వేళకు అన్నం పెట్టడం లేదంటూ వసతిగృహం విద్యార్థులు
ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ వంట మనుషుల నిర్లక్ష్యం వల్లే అన్నంలో పురుగులు వస్తున్నాయని, వెంటనే వంట మనుషులతో పాటు కేర్‌టేకర్‌ను మార్చాలని వారు డిమాండ్ చేశారు. రాత్రి సమయంలో వసతి గృహంలో ఎవరూ ఉండడం లేదని తెలిపారు. మెనూ పాటించడం లేదని పేర్కొన్నారు.
విషయం తెలుసుకున్న తహసీల్దార్ వివేక్, జీసీడీవో విజయకుమారి, ఎంపీడీవో క్రాంతికుమారి, ఎస్సై క్రాంతికిరణ్, ఎంఈవో కాలేరు యాదగిరి.. మోడల్ స్కూల్‌కు చేరుకొని విద్యార్థినులతో మాట్లాడారు. నాణ్యత, మెనూ పాటించేలా చూస్తామని, వంట మనుషులను మారుస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం విద్యార్థుల కోసం తయారుచేసిన భోజనాన్ని వసతి గృహ విద్యార్థినులకు వడ్డించారు. నెల రోజుల నుంచి నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందించడం లేదని కేర్టేక్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు కాంట్రాక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ విషయంపై తహసీల్దార్ వివేక్, జీసీడీవో విజయకుమారిని వివరణ కోరారు. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు.