హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఎంఎన్‌జే దవాఖానను నిర్లక్ష్యపు క్యాన్సర్ పట్టి పీడిస్తున్నది. ప్రభుత్వం పట్టింపులేమికి దవాఖాన పరిపాలనా యంత్రాంగం తోడవడంతో రోగుల ఆరోగ్య పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు ఇచ్చే మందులు చాలా ఖరీదైనవి. వీటిని బయటకొనే స్థోమత నిరుపేద రోగులకు ఉండదు. అయితే చికిత్సలో భాగంగా కొన్ని రకాల మందులు, ఇంజక్షన్లను వారికి దవాఖానలోనే ఇస్తారు. మరికొన్ని ఇంటికి పంపిస్తారు. అయితే కొంతకాలంగా ఎంఎన్జేలో అత్యవసర, ప్రాథమిక స్థాయి, సాధారణ మందులు కూడా అందుబాటులో ఉండడం లేదు. కాంగ్రెస్ సర్కారు దవాఖానలపై శ్రద్ధ పెట్టకపోవడంతో నిధులు సకాలంలో అందక మందులను సరఫరా చేసే ఏజెన్సీలు చేతులెత్తేశాయి. ఫలితంగా రోగులకు మందులతో పాటు కొన్ని రకాల సర్జికల్ పరికరాలు అందుబాటులో లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
ఎంఎన్‌జేకు మూడు నెలలకోసారి ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయాలి. ఈ నిధులతోనే అవసరమైన మందులు, వైద్య పరికరాలు, దవాఖాన నిర్వహణ తదితర కార్యకలాపాలు కొనసాగుతాయి. అయితే తొమ్మిది నెలల నుంచి నిధులు విడుదల కాలేదు. ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు ప్లేట్లెట్స్ పెంచేందుకు ఇచ్చే ‘రోమిప్లాస్టిన్’ అనే డ్రగ్ కొన్ని రోజులుగా అందుబాటులో లేదు. బయట దీని ఖరీదు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు ఉంటుంది. క్యాన్సర్ రోగుల్లో తెల్ల రక్తకణాలు పెంచడానికి ‘పెగ్విల్ గ్యాస్ట్రిమ్’ అనే డ్రగ్ ఇస్తారు. కొంత కాలంగా ఈ మందులు కూడా అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు.
బయట ఈ మందు ఖరీదు రూ.4వేల వరకు ఉంటుంది. ఇలా చెబుతూ పోతే చాలా రకాల మందులు అందుబాటులో లేక రోగులు ప్రైవేట్‌లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. అలాగే పెద్దపేగు క్యాన్సర్ రోగులకు అవసరమయ్యే కొలాస్టమి బ్యాగ్‌లు అందుబాటులో లేక ప్లాస్టిక్ కవర్లను చుట్టుకోవాల్సి వస్తున్నది. ఇలా కవర్లను చుట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు ఏర్పడే ప్రమాదం ఉన్నదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కానీ బయట కొనే స్థోమత లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తున్నదని రోగులు చెబుతున్నారు.
కేసీఆర్ హయాంలో సర్కారు దవాఖానలు కార్పొరేట్ స్థాయిలో సేవలు అందించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకురావడమే గాక నాణ్యమైన మందులు అందాయి. నిధుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి అవసరమైన నిధులు మంజూరు చేయడంతో దవాఖానల నిర్వహణ సజావుగా సాగింది. అప్పట్లో దవాఖానలో మందులు ఇవ్వకపోతే అది నేరం. అంటే అన్ని రకాల మందులు కచ్చితంగా సర్కారు దవాఖానల్లో అందుబాటులో ఉంచేవారు.
ఎంఎన్జేలో మందుల కొరత అనే పదం వినించిన దాఖలాలు లేవు. ఎవరైనా మందులు లేవు అని చెప్పి రోగిని బయటకు పంపితే వారిపై చర్యలు తీసుకునేవారు. దవాఖానలో అవసరమైన మందులకు సంబంధించిన ఇండెంట్‌ను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ముందస్తుగానే సరిపడా మందులను సమకూర్చేవారు. కానీ కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వల్ల ఇప్పుడా పరిస్థితి లేదు. మందుల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి దాపురించింది. లేకపోతే బయట నుంచి డబ్బులు పెట్టి కొనాల్సిందే.