దుండిగల్, ఫిబ్రవరి 17: ఆతస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్, శామ్సంగ్ సెమీకండక్టర్ ఇండియా రీసెర్చ్ సంయుక్తంగా నిర్వహించిన అన్వేషణ-2026 జాతీయస్థాయి పోటీల్లో ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఆర్ఐటీ) విద్యార్థులు రూపొందించిన బోర్బోట్ ఎక్స్-బోర్వెల్ రెస్క్యూబాట్ తృతీయ బహుమతి సాధించింది. జనవరి 29, 30న హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ ప్రాంతీయ స్థాయి పోటీలో ఈ బృందం ప్రథ మ స్థానాన్ని కైవసం చేసుకొని రూ.30 వేల నగదు బహుమతిని పొందింది. ఫిబ్రవరి 11, 12న బెంగళూరులో జరిగిన గ్రాండ్ ఫినాలేలో దేశవ్యాప్తంగా ఎంపికైన 48 అత్యుత్తమ ప్రాజెక్టులతో పోటీపడి జాతీయస్థాయిలో మూడవ స్థానం సాధించింది. మరో రూ.30 వేల నగదు బహుమతిని సొంతం చేసుకుంది.
బోర్‌వెల్స్‌లో పడి ప్రాణాలు కోల్పోతున్న చిన్నారుల ఉదంతాలను చూసి చలించిన విద్యార్థులు ఈ రెస్క్యూబాట్ను రూపొందించారు. ఇరుకైన, క్లిష్టమైన బోర్‌వెల్స్‌లో చిక్కుకున్న పిల్లలను సురక్షితంగా, వేగంగా వెలికితీయడానికి ఈ వర్కింగ్ ప్రొటోటైప్ సహాయపడుతుంది. ఈ ఆవిష్కరణపైఎంల్ఆర్ఐటీ వ్యవస్థాపక కార్యదర్శి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో డైరెక్టర్ మర్రి శ్రేయారెడ్డి, ప్రిన్సిపాల్ రాధికాదేవి, ఈసీఈ హెచ్‌వోడీ ఎస్వీఎస్ ప్రసాద్, మెంటార్ ఎం రాజునాయక్ విద్యార్థులను సన్మానించి, అభింనందించారు.