హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీలా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి విమర్శించారు. శాసనమండలిలో సోమవారం బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశలు అడియాశలయ్యేలా ఈ బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తిరోగమనం దిశగా పోతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్ర జీఎస్డీపీ 12.5శాతంగా ఉంటే, ప్రస్తుతం రేవంత్ సర్కార్ పాలనలో 10.7శాతానికి దిగజారిందని దుయ్యబట్టారు. దీర్ఘకాలిక దృష్టితో కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి నమూనాలు భావితరాలకు కనపడే విధంగా సంపద సృష్టి జరిగిందని తెలిపారు. రెండున్నరేండ్ల పాలనలో 3.47లక్షల కోట్లు అప్పు చేశామని చెబుతున్న ప్రభుత్వం ఒక్క ప్రాజెక్ట్, ఒక్క నిర్మాణం పూర్తి చేసిందీ లేదని మండిపడ్డారు. ఈ అప్పులు ఎందుకు చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను తిట్టడం, కేటీఆర్‌ను కించపరచడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నదని విమర్శించారు.
కేసీఆర్ వేసిన పునాదులపైనే ప్రస్తుతం రాష్ట్రం ఈ మాత్రం అభివృద్ధి వైపు సాగుతున్నదని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పిస్తూ సంతకం చేసిన ఫైల్ ఎక్కడుందని ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ హయాంలో నాట్లు, నాట్లకు మధ్య రైతు బంధు అందిస్తే, రేవంత్ సర్కార్ ఓట్లకు, ఓట్లకు మధ్య రైతు భరోసా ఇస్తున్నదని ఎద్దేవా చేశారు. 16 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రైతు రుణమాఫీ బకాయి ఉన్నదని తెలిపారు. కేసీఆర్ హయాంలో సమయానికి సరిపడా యూరియా, నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేవని, ఇప్పుడు వీటి కోసం రైతన్నలు అరిగోస పడుతున్నారని గుర్తు చేశారు. ఈ బడ్జెట్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం కేటాయించిన రూ. 5500 కోట్లు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు. బడ్జెట్లో కేవలం రూ.12,511 కోట్లు కేటాయించి బీసీలను మోసం చేశారని పేర్కొన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల బెనిఫిట్స్ చెల్లింపుల్లో ఎందుకు జాప్యం జరుగుతున్నదని నిలదీశారు. బడ్జెట్లో ఏ ఒక్క రంగానికి కూడా న్యాయం జరగలేదని పేర్కొన్నారు.
రెండేండ్లలో సాగునీటి రంగం నిర్వీర్యం
కాంగ్రెస్ పాలనలో సాగునీటి రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. గతంలో కేసీఆర్ సర్కార్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలో పూర్తి చేశామని, కానీ కాంగ్రెస్ సర్కార్ 90 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ నుంచి కొండ పోచమ్మసాగర్ కనెక్టివిటీని కేవలం 24రోజుల్లో పూర్తిచేశామని గుర్తుచేశారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల నిర్మాణ సమయంలో దేశంలో ఎక్కడాలేని విధంగా ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ ద్వారా నిర్వాసితులందరికీ సామూహిక గృహప్రవేశాలు కల్పించామని గుర్తుచేశారు. దేశంలో అతి తక్కువ కాలంలో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నది రేవంత్ సర్కారేనని స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణ విషయంలో ప్రభుత్వం పట్టింపులకు పోవడం సరికాదని సూచించారు. పేద ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించాలనే నిర్ణయం సరికాదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన ధరణిని బంగాళాఖాతంలో కలిపేశామని ప్రకటించి, గొప్పగా చెప్పిన భూభారతి అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ ఒక్క గ్రామంలో భూమి పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ కాలేదని తెలిపారు.