భద్రాచలం, ఏప్రిల్ 7: పార్టీ నాయకులు, కార్యకర్తల కష్టం.. ఓటర్ల ఆశీస్సులతో బీఆర్ఎస్ తరఫున భద్రాచలం ఎమ్మెల్యేగా వెంకట్రావును గెలిపిస్తే 115 రోజులు కాకముందే కాంగ్రెస్లో చేరడం సిగ్గుమాలిన చర్యగా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పేర్కొన్నారు. భద్రాచలం నియోజకవర్గ ప్రజల తీర్పును ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు అవహేళన చేశారని అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని రెడ్ల సత్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటుపడేలా రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో సవరణ తీసుకువస్తామని హామీ ఇచ్చి, 24 గంటలు గడవకముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ఆ పార్టీ ద్వంద్వనీతికి నిదర్శనమని విమర్శించారు.
శాసనసభ స్పీకర్ వెంటనే తెల్లం వెంకట్రావు శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఎమ్మెల్యేగా అనర్హుడిగా గుర్తించాలని కోరారు. లేనిపక్షంలో తమ పార్టీ అధినాయకత్వం సూచనల మేరకు హైకోర్టులో పిల్ వేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని వెళ్లినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం ఏమీలేదని అన్నారు. తన వ్యక్తిగత స్వలాభం కోసం వేలాదిమంది ప్రజల ఆశలను అడియాశలు చేసిన వెంకట్రావుకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వస్తే పార్టీ ఫిరాయింపుపై నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయే కాలంలో నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ కోఆర్డినేషన్ కమిటీలను వేస్తామని, అన్ని మండల పార్టీ పదవులు మారుస్తామని తెలిపారు. కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని చెప్పారు. సమావేశంలో భద్రాచలం నియోజకవర్గ మాజీ ఇన్చార్జి మానె రామకృష్ణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, దుమ్ముగూడెం మండల అధ్యక్షుడు అన్నెం సత్యాలు, తాండ్ర వెంకట రమణారావు తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.