హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తేతెలంగాణ): ‘తెలంగాణ సాధకుడు, తొలి సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీసుకు రక్షణ ఇవ్వలేని పోలీసులను చూసి సిగ్గుపడుతున్నా. హోంశాఖ మం త్రిగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఘటనకు బాధ్యత వహించాలి’ అని ఎమ్మెల్సీ తాత మధుసూదన్ డిమాండ్ చేశారు. పాలకులు చిత్తశుద్ధితో పనిచేసి ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకోవాలని, ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఆఫీసుల్లోని గోడలపై బలవంతంగా ఫొటోలు పెడితే ఒరిగేదేమీ ఉండదని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్‌ది గూండాగిరీ: శంభీర్‌పూర్ రాజు
కాంగ్రెస్ నాయకులు వీధిరౌడీల్లా గూండాగురి చేస్తూ యథేచ్ఛగా దుర్మార్గాలకు తెగబడుతున్నారని ఎమ్మెల్సీ శంభీర్‌పూర్ రాజు ధ్వజమెత్తారు. క్యాంపు ఆఫీసుపై దాడికి దిగి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు.
బెదిరింపులతోనే పాలన: క్రాంతికిరణ్
కాంగ్రెస్ రెండున్నరేండ్లుగా దాడులు, బెదిరింపులతోనే పాలన సాగిస్తున్నదని అంధోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ గూండాలు కేసీఆర్ క్యాంపు ఆఫీసుపై చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన పిరికిపంద చర్యగా అభివర్ణించారు. అధికార పార్టీ నాయకులు విచక్షణ కోల్పోయి వ్యవహరించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. దమ్ముంటే ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చేలా సీఎం, మంత్రులపై ఒత్తిడి తేవాలని హితవు పలికారు. అధికారం శాశ్వతంకాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
పిరికిపంద చర్య: చంద్రావతి
గజ్వేల్‌లోని కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి పిరికిపంద చర్య అని మాజీ ఎమ్యెల్యే బానోత్ చంద్రావతి అభివర్ణించారు. కాంగ్రెస్ పాలనపై వస్తున్న ప్రజావ్యతిరేకతను కప్పిపుచ్చుకొనేందుకే అధికార పార్టీ ఇటువంటి దాడులను ప్రోత్సహిస్తుందని విమర్శించారు.
అదుపు తప్పిన శాంతిభద్రతలు: చిరుమర్తి
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆందోళన వ్యక్తంచేశారు. కేసీఆర్ క్యాం పు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు.
రాజకీయమంటే రౌడీయిజం కాదు: దేశపతి
గజ్వేల్‌లోని తెలంగాణకు తొలి సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎమ్మెల్యే కార్యాలయంపై కాంగ్రెస్ మూకలు దాడి చేయ డం సిగ్గుచేటని శాసనమండలి విప్ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ‘రేవంత్‌రెడ్డీ.. రాజకీయమంటే రౌడీయిజం కాదు.. ప్రజాసమస్యల పరిష్కారానికి దారి చూపడం.. భావజాలంతో పోరాడటం’అని చురకలంటించారు. పోలీస్ యంత్రాంగం ప్రేక్షకపాత్ర పోషించడం వ్యవస్థల పతనాన్ని సూచిస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. అధికారంలో ఉండి ఇలా దాడులు చేయించడం అనేది రేవంత్ ఎదుర్కొంటున్న అస్తిత్వ సంక్షోభానికి, మానసిక ఆందోళనకు, అభద్రతాభావానికి నిదర్శమని అభివర్ణించారు.