హనుమకొండ, జూలై 13 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ తకళ్లపల్లి రవీందర్రావు ఆరోపించారు. హనుమకొండలోని బీఆర్ఎస్ జిల్లా కా ర్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్ పర్యటన అనంతరమే ప్రభుత్వం దేవాదుల పంపులను ప్రారంభించిందని చెప్పారు. కాం గ్రెస్ ప్రభుత్వ పాలనలో 15 ఏండ్లు దేవాదుల ప్రాజెక్టుకు బరాజ్ లేకుండా వరదల సమయంలో పంపింగ్ చేశారని గుర్తుచేశారు. కన్నెపల్లి, మేడిగడ్డ ఎక్కడ ఉన్నాయనేది కేటీఆర్ అంత స్పష్టంగా చెప్పినా కూడా అర్థం కావడం లేదా? అని ఎద్దేవాచేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి గేట్లు మూయకుండా నీళ్లు లిఫ్ట్ చేయొచ్చని చెపుతుంటే సీఎం ఇంత అజ్ఞానంతో మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని 30 నెలలు దాటినా కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంప్‌హౌస్‌పై రేవంత్‌రెడ్డికి అవగాహన లేకపోవడం సిగ్గుచేటని తెలిపారు.
రైతాం గం కోసం కన్నెపల్లి మోటర్లు నడిపించాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అడిగితే .. బీఆర్ఎస్ నాయకులను కోసి ఆ రక్తం పొలం మీద చల్లితే పంట పండుతుందని అనడం దుర్మార్గమని మండిపడ్డారు. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో క్రైం రేట్ పెద్ద ఎత్తున పెరిగిన విషయం నేషనల్ క్రైం బ్యూరో రికార్డులు చూస్తే తెలుస్తుందని చెప్పారు. 60 ఏండ్లుగా తెలంగాణ ప్రజల రక్తాన్ని కాంగ్రెస్ పార్టీ తాగిందని ధ్వజమెత్తారు. మొన్నటి వరకు గోదావరిలో నీళ్లులేవని అబద్ధాలు చెప్పిన సీఎం.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్షేత్రస్థాయిలో నీటిని చూపించగా ఎన్డీఎస్ఏ రిపోర్టు అంటూ డ్రామాలు ఆడతున్నాడని ఎద్దేవాచేశారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ కే వాసుదేవరెడ్డి మాట్లాడు తూ.. సీఎం రేవంత్ వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డీజీపీని కోరారు. సమావేశంలో ‘కుడా’ మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి పాల్గొన్నారు.