MLC Ravinder Rao| సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు అరెస్ట్ అప్రజాస్వామికమని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. మహబూబాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చే ప్రక్రియను మార్చుకోవాలని.. లేకపోతే ఆ తల్లి ప్రతాపం చూస్తావంటూ హెచ్చరించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి రాష్ట్రాన్ని ఆంధ్రకు అమ్ముతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ చరిత్రను మార్చలేరని.. చరిత్రలో రేవంత్‌రెడ్డిలాంటి పాలకులు ఎందరో మట్టికరిచారన్నారు.
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలన చూసి సిగ్గుపడుతున్నారన్నారు. రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసిన గొప్ప పాలకుడు అంటూ ఎద్దేవా చేశారు. ఒక్క హామీని అయినా నిజాయితీగా అమలు చేశావా? అంటూ రేవంత్‌రెడ్డిని నిలదీశారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నారని.. లగచర్ల లాంటి పోరాటాలు ప్రజల తరఫున చేసిన ఎంతో చరిత ఉన్న పార్టీ బీఆర్ఎస్ అన్నారు. అరెస్టులు, కేసులు బీఆర్ఎస్కు కొత్త కాదన్నారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. పనికి మాలిన సీఎం వద్దంటూ కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారన్నారు.