హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): కోహినూర్ వజ్రం దొరికిన నేల మీద తల్లికి కిరీటం ఉండకూడదా? 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆరాధించే మాతృమూర్తిని పార్టీ కోణంలో రూపొందిస్తారా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభీ వాణీదేవి ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో చేపట్టిన నిరసనలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ తల్లి ఈ ప్రాంత అస్తిత్వమని, విగ్రహాన్ని చూస్తేనే దండం పెట్టాలనిపించేలా ఉద్యమనేత కేసీఆర్ రూపొందించారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రూపొందించిన విగ్రహంలో పేదరికం ఉట్టిపడుతున్నదని విమర్శించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పాడుకున్న నేల మీద తెలంగాణ తల్లికి రత్నాలు ఉండకూడదా? అని అగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ మీద ఆకసుతోనే తెలంగాణ తల్లి విగ్రహం మార్చారని దుయ్యబట్టారు. ఏడు దశాబ్దాల క్రితం భారతమాతను రథం మీద కూర్చొబెట్టి రథసారథిగా జాతిపిత మహాత్మాగాంధీ, జవహర్రాల్నెహ్రూ సహా స్వాతంత్ర సమరయోధులు రథంపై ఉన్న చిత్రాన్ని ప్రదర్శించారు. భారతమాత, చాలా రాష్ర్టాల్లోని మాతల విగ్రహాల్లో ఏ విగ్రహం కూడా కిరీటం లేకుండా లేదని చెప్పారు. బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లా ?అని ప్రశ్నించారు. ప్రభుత్వం రూపొందించిన కొత్త విగ్రహాన్ని కాంగ్రెస్ తల్లి గానే చూస్తాం తప్ప, తెలంగాణ తల్లిగా చూడబోమని తేల్చిచెప్పారు.