బంజారాహిల్స్,మే 20: ఫ్యూచర్‌సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందాలో మునిగిపోయిన సీఎం రేవంత్‌రెడ్డి మున్పిపల్శాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధిపనులను గాలికొదిలేశారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ మండిపడ్డారు. బుధవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లోని అంబేద్కర్‌నగర్ బస్తీలో ఎమ్మెల్సీ పర్యటించారు. అంబేద్కర్‌నగర్‌లో నాలా పనులను అర్ధాంతరంగా ఆపేశారని, పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉండటంతో పాటు రెండునెలలుగా తాగునీరు సక్రమంగా రావడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 24గంటల నీటి సరఫరా చేస్తుండేవారని, ఇప్పుడు నాలుగురోజులకోసారి కూడా రావడం లేదని దాసోజు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని అనేక బస్తీలు సమస్యల్లో చిక్కుకున్నాయని, వాటిని పరిష్కరించాల్సిన ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎప్పు డు తన పదవి పోతుందోననే భయంతో భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతిలోనే మున్సిపల్‌శాఖ ఉన్నా ఒక్కసారైన సమీక్ష చేశారా? అని ప్రశ్నించారు. అంబేద్కర్‌నగర్‌లోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నన్, జోనల్ కమిషనర్ సంతోష్ బదావత్ను ఫోన్లో కోరారు. తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనబాట పడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బంజారాహిల్స్ డివిజన్ బీఆర్ఎస్ నేతలు జేజోల రాజు ముదిరాజ్, రమేశ్, బస్వాగౌడ్, రాములు, ఎండీ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.