ఖైరతాబాద్, మార్చి 23 : బీసీలను మొదటినుంచీ మోసం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వక్తలు స్పష్టంచేశారు. బీసీ జనసభ ఆధ్వర్యం లో ‘బీసీలకు మరో మోసం-తెలంగాణ రాష్ట్ర బడ్జెట్’ అంశంపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశానికి శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి హాజరై మాట్లాడారు. బీసీలకు నమ్మకద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, 42శాతం రిజర్వేషన్లు, ఏడాదికి రూ.20వేల కోట్ల బడ్జెట్, బీసీలకు సబ్‌ప్లాన్‌లో చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐదేండ్లలో లక్ష కోట్లు ఖర్చుపెడుతానని చెప్పారని, కానీ ఆ సంఖ్య రూ. 20వేల కోట్లు కూడా దాటడం లేదని విమర్శించారు. ఎంబీసీలకు మంత్రిత్వశాఖ, బడ్జెట్లో కేటాయింపు చేస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. బీసీల రాజ్యాధికారం కోసం ప్రజాక్షేత్రంలో పోరాడాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ చరిత్ర మొత్తం మోసమే
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం మోసమేనని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ విమర్శించారు. నెహ్రూ, ఇందిరల నుంచి మొదలుకొని రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, నేటి రాహుల్ వరకు అందరూ బీసీలను మోసం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. నాడు కేసీఆర్ చేపట్టిన కులగణనలో బీసీలు 51శాతం ఉన్నట్టు తేల్చితే, రేవంత్‌రెడ్డి మాత్రం 46శాతానికి తగ్గించారని, బీసీలకు బడ్జెట్లో లక్ష కోట్లు అని చెప్పి 2024-25లో 9,200 కోట్లకు 2,068 కోట్లు, 2025-26లో రూ.11,405.31 కోట్లకు రూ.3,500 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, ఇక ఈ ఏడాది బడ్జెట్లో రూ.12,511 కోట్లు కేటాయించి ఎంత ఖర్చుచేస్తారో తెలియదని మండిపడ్డారు. బడ్జెట్లో కాంగ్రెస్ మోసాన్ని నిరసిస్తూ యావత్ బీసీ సంఘాలతో చర్చించి అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, ఊరూరా బడ్జెట్ ప్రతులు దహనం చేసి, చివరగా అసెంబ్లీని ముట్టడిస్తామని స్పష్టంచేశారు.
రాజకీయ సంకల్పం కావాలి
బీసీలకు రాజకీయ సంకల్పం కావాలని, తద్వారా సాహిత్య, సాంస్కృతికరంగాలు కలిసి పనిచేస్తేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని జూలూరు గౌరీశంకర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 200మంది బీసీ బిడ్డలు చనిపోయినా కాంగ్రెస్ పార్టీ జెండా మోసే బీసీలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీసీబిడ్డల చావులను ఆపేందుకు కేసీఆర్ ముందుకురావాలని, వెలుగుమట్ల, కుమ్మెరలో ఉద్యమం వచ్చిందని, అదే స్ఫూర్తితో కాంగ్రెస్‌కు ఘోరీ కట్టే చైతన్యం రావాలని కోరారు. ప్రొఫెసర్ జయశంకర్, కాళోజీల స్ఫూర్తిగా తీసుకోవాలని, ప్రతి ఊరు బీసీ లగచర్ల కావాలని, గ్రామగ్రామాల్లో బడ్జెట్ పత్రాలను దహనం చేయాలని పిలుపునిచ్చారు.
బడ్జెట్ కేటాయింపులకు మనసు రావడం లేదు
బీసీలకు కేటాయించినట్టు చెబుతున్న రూ.12,511కోట్లలో ఈడబ్ల్యూఎస్, ఈబీసీలకు పోగా నిజమైన బీసీ వర్గాలకు మిగిలేది ఏమీ ఉండదని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు చిరంజీవులు ఆవేదన వ్యక్తంచేశారు. ఏపీలో రూ.3.32లక్షల కోట్ల బడ్జెట్లో రూ.51వేల కోట్లను బీసీలకు కేటాయించారని గుర్తుచేశారు. కేంద్ర బడ్జెట్లో రూ.54.30వేల కోట్లలో బీసీలకు కేటాయించింది కేవలం రూ.2,200కోట్లు మాత్రమేనని, తెలంగాణలోనూ అదే దారుణ పరిస్థితి నెలకొన్నదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో రూ.45వేల కోట్లలో బీసీలకు 60శాతం ఖర్చుపెట్టడంతో పాటు కులవృత్తులకు సైతం చేయూతనందించిందని గుర్తుచేశారు. అందాల పోటీలు, అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడి కార్యక్రమానికి వందల కోట్లు, ఇటీవల జరిగిన గద్దర్ అవార్డుల కార్యక్రమంలో ఒక్కో యాంకర్‌కు రూ.60లక్షలు ఇచ్చారని, కాని బీసీల విషయానికి వచ్చే సరికి కేటాయింపులకు మనసు రావడం లేదని విరుచుకుపడ్డారు.
ఖజానాలో డబ్బులు లేవంటే దిగిపో
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 42శాతం ఇస్తామన్న రిజర్వేషన్లు 17శాతం మాత్రమే ఇచ్చి మోసగించిందని యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ దుయ్యబట్టారు. ప్రభుత్వం ఎన్ని మోసాలు చేసినా స్థానిక సంస్థ ఎన్నికల్లో 50శాతానికి పైగా బీసీలు గెల్చుకున్నారని గుర్తుచేశారు. ఖజానాలో డబ్బులు లేవని సీఎం రేవంత్‌రెడ్డి తరచూ అంటున్నారని, ఒకవేళ డబ్బులు లేకపోతే పదవి నుంచి వైదొలగాలని హితవు పలికారు. బీసీలను మోసగించిన కాంగ్రెస్‌ను వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేస్తామని తేల్చిచెప్పారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుటం పురుషోత్తం పటేల్, కాటం నర్సింహ యాదవ్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు యాదయ్య గౌడ్, రాజారాం యాదవ్, అయోధ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.