హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే ప్రయ త్నం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి మండిపడ్డారు. రూ.2 లక్షల రుణమాఫీ ఒకే దఫా చేస్తామని చెప్పి మాట తప్పిందని ఆరోపించారు. సీజన్ ప్రారంభమై నెల దాటినా రైతు భరోసా ఇవ్వలేదని విమర్శించారు. ఆరు గ్యారెంటీల అమలుకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదని ఆరోపించారు. పింఛన్ రూ.4వేలకు పెంచుతామని అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినా అమలుచేయకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
బీసీ రిజర్వేషన్లు పెంచకపోతే యుద్ధమే
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య హెచ్చరిక
రవీంద్రభారతి, జూలై 28: ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 22 నుంచి 42 శాతానికి పెంచకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీ కులగణన చేపట్టాకే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఆ మాటే ఎత్తకుండా నిర్వహిస్తామనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రెడ్డి పార్టీగా మారిపోయిందని విమర్శించారు. బీసీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు నోళ్లు మూగపోయాయా? బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్‌రెడ్డిని ఎందుకు నిలదీయడంలేదు?’ అని ప్రశ్నించారు. సమావేశంలో కృష్ణ, మల్లేశ్, రాజేందర్, అంజి, దీపిక పాల్గొన్నారు.