హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు ఇచ్చే ఉద్దేశమున్నప్పుడు గ్రామసభలు నిర్వహించి సామాన్యులను ఇబ్బంది పెట్టడమెందుకని ఎమ్మెల్సీ శంభీర్పూర్రాజు ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు నీటిమూటలయ్యాయని విరుచుకుపడ్డారు. పథకాల అమలుపై మంత్రులు తలోమాట మాట్లాడుతూ గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో శనివారం బీఆర్ఎస్ నాయకులు గ్యాదరి బాలమల్లు, బొమ్మెర రామ్మూర్తి, గుడాల భాస్కర్‌తో కలిసి శంభీపూర్ రాజు విలేకరులతో మాట్లాడారు. హామీల అమల్లో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. దరఖాస్తుల పేరిట ప్రజలను ఇబ్బంది పెడుతున్నదని దుయ్యబట్టారు. ప్రజలు తిరగబడుతుంటే మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు కాంగ్రెస్ నాయకుల వీపులపై విమానం మోత మొగిస్తున్నారని తెలిపారు. ఆ నొప్పులు తగ్గించుకొనేందుకు వారికి బీఆర్ఎస్ తరఫున జిందాతిలిస్మత్, ఝండూబాం పంపిస్తున్నామని ఎద్దేవా చేశారు.