కురవి, జూలై 17: రాష్ట్రంలో రైతులకు నష్టం జరిగితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ హెచ్చరించారు. రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి రైతుల సంఖ్యను తగ్గించేందుకు కాంగ్రెస్ సర్కార్ కొర్రీలు పెడుతున్నదని విమర్శించారు. ప్రస్తుత నిబంధనలు చూస్తే కనీసం 50 శాతం రైతులకు కూడా రుణమాఫీ అయ్యే అవకాశం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఆమె మహబూబాబాద్ జిల్లా కురవి వీరభద్రస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉన్నన్ని రోజులు రాష్ట్ర సాధకుడు, మాజీ సీఎం కేసీఆర్ పేరును ప్రజలు మర్చిపోరని అన్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు రైతుల కష్టాలను సీఎం దృష్టికి తీసుకుపోవాలని సూచించారు. పార్టీలో చేరికలపై ఉన్న శ్రద్ధ ప్రజలకు అందించే పాలనపై సీఎం రేవంత్‌రెడ్డికి లేదని దుయ్యబట్టారు. అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్య పెట్టిన కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించే రోజు దగ్గరలోనే ఉన్నదని అన్నారు.
కేసీఆర్‌ను అభాసుపాలు చేయాలనే కుట్ర కోణంతోనే సీఎం రేవంత్‌రెడ్డి కాలం వెల్లదీస్తున్నాడని మండిపడ్డారు. సుప్రీం కోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రజలు మరిచిపోవాలనే రేవంత్‌రెడ్డి రోజుకో కమిషన్ పేరిట కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.
మహబూబాబాద్ మున్సిపాలిటీకి రూ. 50 కోట్లు, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీలకు రూ. 25 కోట్ల చొప్పున నిధులను మంజూరు చేయించామని, ఆ పనులు పూర్తిచేస్తే తామే ప్రజాప్రతినిధులను సన్మానిస్తామని తెలిపారు. అంగన్వాడీలకు గుర్తింపు తీసుకువచ్చిందే కేసీఆర్ ప్రభుత్వమన్న విషయాన్ని ఆ శాఖ మంత్రి సీతక్క మర్చిపోవద్దని సూచించారు. అంగన్వాడీలకు రూ.13 వేల వేతనంతోపాటు పదవీకాలం ముగిస్తే రూ. 2 లక్షలు ఇవ్వాలనే జీవోను తీసుకువచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. ఎన్నికల కోడ్‌తో ఆ జీవో బయటకు రాలేదని, అది కూడా కాంగ్రెస్ చేసినట్టు చెప్పుకోవడం శోచనీయమని అన్నారు.