మహబూబాబాద్ రూరల్, ఆగస్టు 21: కాంగ్రెస్ సర్కార్ రైతులకు తీరని ద్రోహం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రుణ మాఫీలో అనేక లోపాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన ఆందోళన వ్యక్తం చేశారు.
ఏ గ్రామంలో చూసిన రుణమాఫీ కాని రైతులే ఎక్కువ ఉన్నారని తెలిపారు. వారంతా రోజూ బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగినా సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదని విమర్శించారు. రుణమాఫీపై ప్రభుత్వం అనేకసార్లు మాట మార్చిందని దుయ్యబట్టారు.
కేసీఆర్ ప్రభుత్వం లక్షలోపు రుణాన్ని 36 లక్షల మందికి మాఫీ చేస్తే కాంగ్రెస్ సర్కార్ రెండు లక్షల రుణ మాఫీ అని మోసం చేసి కేవలం 22 లక్షల మందికి మాత్రమే చేసిందని మండిపడ్డారు. రుణమాఫీ జరగని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్టు ఆమె తెలిపారు.