హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తూ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం, మంత్రులకు సోయిలేదు కానీ ఢిల్లీకి మాత్రం 20 సార్లు చకర్లు కొట్టారంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ విమర్శించారు. వర్షాలతో మహబూబాబాద్ జిల్లా తీవ్రంగా నష్టపోయిందని, అక్కడి ప్రజలను, రైతులను ఆదుకోవాలని కోరారు. కేసీఆర్ ప్రజలల్లోకి వస్తారని కాంగ్రెస్ నాయకులకు భయం పట్టుకున్నదని ఎద్దేవాచేశారు. ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానందతో ఆదివారం తెలంగాణ భవన్లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లోకి ఎందుకు రాకూడదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చినందుకు రావద్దా అంటూ నిలదీశారు.
కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హకు సీఎం, మంత్రులకు లేదని, కేసీఆర్ కొట్లాడి రాష్ట్రం తెస్తేనే సీఎం, మంత్రులు అయ్యారనే విషయాన్ని భట్టి గుర్తు పెట్టుకోవాలని హితవుపలికారు. కేసీఆర్‌కు ప్రజల్లో ప్రత్యేక స్థానం ఉన్నదని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తన వంతు బాధ్యత నిర్వర్తిస్తారని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార మనస్తాపం చెందినప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతారంటూ ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ నేతలను చూసి ప్రజలు ఓట్లెయ్యలేదని, ఆ పార్టీ మ్యానిఫెస్టోను చూసి ఓట్లేసి మోసపోయారని చెప్పారు. మ్యానిఫెస్టోలో ఉన్న హామీల్లో ఎన్ని అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రుణమాఫీపై వ్యవసాయ శాఖ మంత్రిని రైతులు అడ్డుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై ఇష్టంవచ్చినట్టు మాట్లాడిన రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిందని, అయినా ఆయనలో మార్పు రాలేదని విమర్శించారు.
సీఎం పదవి అప్రతిష్టపాలు
దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వంగా తెలంగాణ కాంగ్రెస్ సరార్ నిలిచిందని ఎమ్మె ల్యే కేపీ వివేకానంద దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని, సీఎం పదవిని అప్రతిష్టపాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి తన భాషను డిప్యూటీ సీఎం, మంత్రులకు నేర్పించి, వారితో కేసీఆర్‌ను తిట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవాచేశారు. రేవంత్ పాలనపై ప్రజలు విసుగుచెంది, కేసీఆర్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. వర్షాలు, వరదలపై సీఎం, మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద రేవంత్‌రెడ్డి స్థాయి తగ్గిపోయిందని, ఇప్పటి వరకు మంత్రులను, టీపీసీసీ చీఫ్ పదవులను ఆయన భర్తీ చేసుకోలేకపోవడమే ఇందుకు నిదర్శమని తెలిపారు.
హైడ్రాకు మార్గదర్శకాలేవీ లేవని, చట్టబద్ధత కూడా లేదని, హైడ్రా పేరుతో కాంగ్రెస్ నాయకులు దందాలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం తమ్ముడి ఇంటికి నోటీసులు మాత్రమే ఇచ్చారని, పేదల ఇండ్లను మాత్రం చెప్పాపెట్టకుండా కూల్చివేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ ఎప్పుడూ అభివృద్ధి చెందలేదని గుర్తుచేశారు. ఎక్కువ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే నగరంలో అత్యధిక అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ నేతలు చెరువులను కబ్జా చేసి ఇండ్లు నిర్మించారని, రియల్ ఎస్టేట్ కోసమే ఫోర్త్ సిటీ అని ఆరోపించారు. స్వేర్ ఫీట్‌కు వంద చొప్పున బిల్డర్ల నుంచి వసూలు చేస్తున్నారని, కాంగ్రెస్ నేతల దందాలను బయటపెడతామని వివేకానంద ప్రకటించారు.