హనుమకొండ, జూలై 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్వలాభం కోసం అధికార పార్టీలో చేరిన ఓ ఎమ్మెల్సీ చివరికి కుల సంఘం భవనాలపైనా పెత్తనం చెలాయిస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని రజక సామాజికవర్గం వారి కోసం గ్రేటర్ వరంగల్‌లోని పద్మాక్షి ఆలయం రోడ్డులో ప్రభుత్వ స్థలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6 కోట్లతో భవనాన్ని నిర్మించింది. నిర్మాణం మొదలైనప్పటి నుంచి రజక భవన్ అని పిలిస్తూ వచ్చారు. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఈ భవనంపై ఆధిపత్యం కోసం భవనానికి రజక భవనం అని పేరు కాకుండా.. సారయ్య చైర్మన్‌గా 13 మందితో మడివేలు మాచదేవ కల్చరల్, ఎడ్యుకేషనల్ అండ్ సోషియో ఎకనమిక్స్ డెవలప్మెంట్ ట్రస్టును ఏర్పాటు చేయించారు.
సారయ్య చైర్మన్‌గా ఉన్న ప్రైవేటు ట్రస్టులో ఆయన కుటుంబ సభ్యులే ఎక్కువ మంది ఉన్నారు. బస్వరాజు సారయ్య తమ్ముడు కుమారస్వామి, చిన్నాన్న రామచంద్రం, బంధువు మచ్చ లక్ష్మీనారాయణతోపాటు సన్నిహితులు డాక్టర్ సాట్ల మధుచందర్, డాక్టర్ సాట్ల వెంకట్, డాక్టర్ గోపాల్, చిట్యాల భిక్షపతి, ఎదులపురం కుమారస్వామి, ముననికుంట రాములు, మామిడాల నర్సయ్య, పొరండ్ల శ్రీకాంత్‌ను సభ్యులుగా చేర్చారు. ట్రస్ట్ రిజిస్ట్రేషన్ కోసం ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కారు డ్రైవర్ డీ రఘువీర్, మరో సహాయకుడు కార్తీక్ సాక్షులుగా సంతకాలు చేశారు.
భవనంలో నిర్వహించే వివాహ, ఇతర కార్యక్రమాలతో వచ్చే కిరాయిలు, ఇతర లావాదేవీలు వారి ఆధ్వర్యంలోనే జరిగేలా ఈ ప్రైవేటు ట్రస్టు ఏర్పాటైందని రజక సామాజికవర్గం వారు ఆరోపిస్తున్నారు. రజక సామాజికవర్గంలోని ఎవరికీ సమాచారం లేకుండా, ఎలాంటి సమావేశం నిర్వహించకుండా, ప్రభుత్వ తరఫున ఎన్నికల అధికారి లేకుండా ప్రైవేటు ట్రస్టును ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఏకపక్షంగా ట్రస్ట్ ఏర్పాటు కావడాన్ని వ్యతిరేకిస్తూ రజక సంఘం కోఆర్డినేటర్ కొల్లూరు మల్లేశ్‌కుమార్, తెలంగాణ రజక నవనిర్మాణ సంఘం అధ్యక్షుడు చీకటి రాజు ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టర్‌కు, బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు.
తెలంగాణ వాషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దీనిపై జూన్ 12న విచారణ నిర్వహించారు. వివాదం పరిషారమయ్యే వరకు రజక భవనం నిర్వహణ బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలోనే జరగాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ భవనాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు ఎమ్మెల్సీ సారయ్య మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆధ్వర్యంలో ఏర్పాటైన ట్రస్ట్ బోర్డును వెంటనే రద్దు చేసి రజక భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆరు జిల్లాల్లోని బీసీ సంక్షేమ శాఖ అధికారులు మండలాల వారీగా ప్రతి గ్రామంలోని రజక సమాజికవర్గం వారికి సమాచారం ఇచ్చి చట్టపరమైన ట్రస్టును ఏర్పాటు చేయాలి. ఈ భవనం ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద కుటుంబాల్లోని పిల్లల విద్య, ఆరోగ్య, వివాహ కార్యక్రమాలకు వినియోగించాలి.
– చీకటి రాజు, తెలంగాణ రజక నవనిర్మాణ సంఘం అధ్యక్షుడు
వరంగల్ నగరంలో రజక భవనం చివరి దశ పనులు జరుగుతున్నాయి. గ్రౌండ్‌ఫ్లోర్ పనులు పూర్తయ్యాయి. రజక భవనం నిర్మాణం కోసం కృషి చేశామని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ట్రస్ట్ ఏర్పాటు చేసి భవనం తాళం తీసుకున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో విచారణ అనంతరం మా ఆధీనంలోకి తీసుకున్నాం.
– ఎస్ లక్ష్మణ్, వెనకబడిన తరగతుల అభివృద్ధి జిల్లా అధికారి