Huzuarabad | హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్‌లో మళ్లీ గులాబీ జెండా ఎగురవేస్తామని ప్రభుత్వ విప్ పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. శనివారం ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు హుజూరాబాద్ నియోజకవర్గంపై ప్రత్యేక అభిమానం ఉన్నదని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటూ.. దేశానికి స్ఫూర్తినిచ్చిన రైతుబంధు, దళితబంధు పథకాలను హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే హుజూరాబాద్ అభివృద్ధి చెందిందని, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేయకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయామని ప్రజలు ఆవేదన చెందుతున్నారని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికలకు రాష్ట్రంలో తొలి అభ్యర్థిగా పార్టీ తనను ప్రకటించినందుకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్‌గా తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడతానన్నారు.
ప్రభుత్వ విప్‌గా పాడి కౌశిక్‌రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, శాసనసభ వ్యవహారాలు, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, కార్మిక శాఖమంత్రి మల్లారెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, నవీన్‌కుమార్, అసెంబ్లీ కార్యదర్శి వీ. నర్సింహాచార్యులు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ సహ పలువురు కౌశిక్‌రెడ్డిని అభినందించారు. కాగా, పాడి కౌశిక్‌రెడ్డిని అభినందించేందుకు హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల రాకతో అసెంబ్లీ ప్రాంగణం అంతా సందడిగా మారింది. అసెంబ్లీ ప్రాంగణం వెలుపల, గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం, పరిసరాలు గులాబీమయమయ్యాయి.