హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ సోమవారంతో ముగిసింది. నిర్దేశిత గడువులోగా బీఆర్ఎస్ నుంచి ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్, కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, తేజావత్ శంకర్‌నాయక్, సీపీఐ నుంచి నెల్లింకటి సత్యం నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 11 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఇందులో బీఆర్ఎస్, సీపీఐ, కాంగ్రెస్ పార్టీల నుంచి దాఖలైన అభ్యర్థులు సమర్పించిన నామినేషన్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా ఉండే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది.
అయితే, 10 మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించాల్సి ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ మినహా మిగిలిన అభ్యర్థులకు ఆ అవకాశం లేదు. ఈ కారణంగా మంగళవారం నామినేషన్ల పరిశీలనలో వాటిని పరిగణనలోకి తీసుకోరు. ఈ లెక్కన ఎన్నికలు జరిగే ఐదు స్థానాలకు గాను బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్‌నాయక్, సీపీఐ నుంచి నెల్లికంటి అభ్యర్థిత్వాలు ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, నామినేషన్ల ఉపసంహరణ గడువు (ఈనెల 13వ తేదీ) ముగిసిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.