హైదరాబాద్, అక్టోబర్ 5(నమస్తే తెలంగాణ) : ఐక్యంగా పోరాడితేనే బీసీ రిజర్వేషన్లు దక్కుతాయని శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో జరిగిన బీసీ ప్రజాప్రతినిధులు, కులసంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఏ విధంగానైనా గెలవాలనే కుయుక్తులతో కాంగ్రెస్ అలవికాని హామీలిచ్చి అధికారం చేపట్టాక ప్రజలను వంచిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు ఐక్యపోరాటాలే మార్గమని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. పార్లమెంటులో చట్టం చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పొందుపర్చితేనే రిజర్వేషన్ల పెంపు సాధ్యమని, అది తెలిసి కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు డ్రామాలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే తమ నాయకుడు కేసీఆర్.. బీసీ, మహిళా రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రానికి గుర్తుచేస్తూ తీర్మానం చేసి పంపారని చెప్పారు.
స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధించుకోవాలంటే సమావేశాలు, ధర్నాలతో సాధ్యపడదని, ఢిల్లీకి తరలివెళ్లి ఐక్య పోరాటాలు చేపట్టాల్సిందేనని స్పష్టంచేశారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు, నేరెళ్ల ఆంజనేయులు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధూకర్, బొల్లం మల్లయ్యయాదవ్, బీఆర్ఎస్ నాయకుడు చెరుకు సుధాకర్, బీసీ నాయకులు జనార్దన్, గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.బీసీ రిజర్వేషన్లపై నేడు చర్చ సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం నేతృత్వంలో ‘బీసీ రిజర్వేషన్లు-ప్రభుత్వ తీరుపై నేడు(సోమవారం) సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రత్యేక చర్చ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఫోరం ప్రతినిధులు దేవళ్ల సమ్మయ్య, ప్రొఫెసర్ మురళీమనోహర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు చర్చ ప్రారంభం కానున్నట్టు వెల్లడించారు. మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.