Congress | హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): బీసీలకు 42 శాతం కోటా ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఊదరగొట్టిన కాంగ్రెస్ ఇప్పుడు కొత్త డ్రామాలకు తెరలేపిందని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి చేతులు దులుపుకొన్నదని దుయ్యబట్టారు. పలుమార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ ఒక్కసారి కూడా బీసీ బిల్లు గురించి చర్చించలేదని మండిపడ్డారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను మరిచిపోయారని ధ్వజమెత్తారు. మాట ఇవ్వడం, మడమ తిప్పడం రేవంత్‌రెడ్డికి వెన్నతో పెట్టిన విద్యేనని ఎద్దేవా చేశారు.
తెలంగాణ భవన్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ నేతలు చిరుమల్ల రాకేశ్, కిశోర్‌గౌడ్, ఉపేంద్రాచారితో కలిసి శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. బీసీ బిల్లు ముసుగులో ఏడాదిన్నర నుంచి కాంగ్రెస్ ఆడుతున్న కపట నాటకాన్ని ఎండగట్టారు. అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాల సలహాలు స్వీకరిస్తామని, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని, తమిళనాడులా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని గప్పాలు కొట్టిన ముఖ్యమంత్రి బిల్లుపెట్టి మూడు నెలలైనా పార్లమెంట్లో ఆమోదానికి ప్రయత్నించడం లేదని విమర్శించారు. మోదీతో అంటకాగుతూ 42 శాతం బీసీ కోటాను అటకెక్కించారని దుయ్యబట్టారు. మంత్రివర్గ విస్తరణ కోసం పదిసార్లు ఢిల్లీ వెళ్లి ఒక్కసారి కూడా బీసీ బిల్లు గురించి ప్రస్తావించక పోవడం బాధాకరమని పేర్కొన్నారు. పాలనను గాలికి వదిలి ఢిల్లీకి మూటలు పంపడమే పనిగా పెట్టుకున్నారని నిప్పులు చెరిగారు.
స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి బడుగు, బలహీన వర్గాలను కాంగ్రెస్ మోసం చేస్తున్నదని మధుసూదనాచారి ఆరోపించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ఆ పార్టీ కులగణన చేపట్టకుండా, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వకుండా, జనాభా దామాషా ప్రకారం బడ్జెట్లో నిధులు కేటాయించకుండా తీరని ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాకా కాలేల్కర్ కమిషన్ సిఫారసులను తొక్కిపెట్టి అన్యాయం చేసిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓట్ల కోసం బీసీ డిక్లరేషన్, సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించి బడ్జెట్లో ఏటా రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పారని, అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని, ముదిరాజ్‌లు, గంగపుత్రులు, పద్మశాలీలు అందరికీ అలవికాని హామీలిచ్చి నమ్మించి మోసం చేశారని దుయ్యబట్టారు.
కులగణనను తప్పుల తడకగా నిర్వహించి బీసీల జనాభాను తగ్గించి చూపారని మధుసూదనాచారి మండిపడ్డారు. అయినప్పటికీ కులగణన తమ ఘనతేనని చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారని దుమ్మెత్తి పోశారు. ఎన్ని చెప్పినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను మళ్లీ నమ్మబోరని అన్నారు. నిండా ముంచిన పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పేందుకు ఎదురుచూస్తున్నారని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అగ్రకుల దురహంకారంతో బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను బలి పశువును చేస్తున్నారని మధుసూదనాచారి పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో పొన్నం జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. రేవంత్ మాయలో పడి బీసీలను వంచించవద్దని పేర్కొన్నారు.
బడుగు, బలహీనవర్గాలను మోసం చేయడంలో బీజేపీ కూడా కాంగ్రెస్ బాటలోనే పయనిస్తున్నదని మధుసూదనాచారి విమర్శించారు. కేంద్రంలో 11 ఏండ్లుగా అధికారంలో కొనసాగుతున్న మోదీ సర్కారు ఇప్పటి వరకు బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయకపోవడం విడ్డూరమని పేర్కొన్నారు. మోసం చేయడంలో కాంగ్రెస్‌ను బీజేపీ మించిపోయిందని ఎద్దేవా చేశారు. ఏది ఏమైనా కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.